
బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి హిందువులు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్కాన్‌ను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలపై దృష్టిసారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని శాంతిభద్రతల పరిస్థితిని గురువారం ఉదయంలోగా నివేదించాలని అటార్నీ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. కాగా, అక్కడి పరిస్థితులు క్షీణించకుండా చూడాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.
బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం.. ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈక్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు కృష్ణదాస్ అరెస్టును వ్యతిరేకిస్తూ పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. బంగ్లాదేశ్‌లో ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై తీవ్రవాద గ్రూపులు దాడులకు పాల్పడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికావని.. హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని అక్కడి అధికారులను కోరింది.





