News

పుష్పగిరి ఆలయంపై ‘బ్రిటిష్‌’ శిల్పాలు

197views

వైయస్సార్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుష్పగిరి పుణ్యక్షేత్రంలోని శివాలపల్లె గ్రామానికి చెందిన శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి దేవాలయం గాలి గోపురం మీద విదేశీ (బ్రిటిష్‌ కాలం నాటి) వస్త్రధారణ వ్యక్తుల శిల్పాలను గుర్తించినట్లు రచయిత, చరిత్ర పరిశోధకులు బొమ్మిశెట్టి రమేష్‌ పేర్కొన్నారు. ఆయన కడపలో మాట్లాడుతూ తను రచించబోయే మైదుకూరు పర్యాటకం అనే పుస్తకానికి సంబంధించి పరిశోధనలో భాగంగా పరిశీలించగా ప్రధాన గాలిగోపురం ముందు మొదటి అంతస్తులోని పైభాగంలో బ్రిటిష్‌ వస్త్రధారణతో ఓ వ్యక్తి మోస్తున్నట్లుగా శిల్పం ఉందన్నారు. ఇదే అంతస్తులో మరొకవైపు ఇద్దరు విదేశీ వ్యక్తుల మధ్య ఒక మహర్షి ఉన్నట్లు అప్పటి శిల్పకారులు చిత్రీకరించారన్నారు. రెండో గాలిగోపురం వెనుక భాగంలోనూ ఇద్దరు విదేశీ వనితల శిల్పాలు ఉన్నాయని తెలిపారు. ఇదే గాలిగోపురం మరొక పక్క మొదటి అంతస్తును మోస్తున్న ఇద్దరి విదేశీ వ్యక్తుల మధ్య వినాయకుని విగ్రహం చూపరులను అబ్బుర పరుస్తోందన్నారు. వీటిపై పూర్తి స్థాయిలో పరిశోధిస్తే చరిత్రకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని రమేష్‌ చెప్పారు.