News

పాకిస్థాన్ బ్యాట్ దళాలను తిప్పికొట్టిన భారత్ సైన్యం

626views

కొన్నాళ్ల క్రితం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి ఇద్దరు సైనికులను కోల్పోయి మూల్యం చెల్లించుకున్న పాక్‌ చివరకు తోకముడిచి తెల్లజెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయినా ఆ దేశ వక్రబుద్ధి మాత్రం మారలేదు. వారి బోర్డర్‌ యాక్షన్‌ టీం(బ్యాట్‌), స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ కమాండోలు మరోసారి చొరబాట్లకు యత్నించారు. దీన్ని భారత సైన్యం గ్రనేడ్లతో తిప్పికొట్టింది. ఈ ఘటనను సైన్యం వీడియోలో బంధించినట్లు ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. ఈ చొరబాటు హజీపూర్‌ సెక్టార్‌లో సెప్టెంబరు 12-13తేదీల్లో మధ్య రాత్రి చోటుచేసుకున్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ వీడియోలో బ్యాట్‌ దళం చొరబడేందుకు యత్నిస్తుండగా.. భారత సైన్యం తిప్పికొట్టడం కనిపిస్తోంది. అండర్‌ బ్యారెల్‌ గ్రనేడ్‌ లాంఛర్ల ద్వారా భారత సైన్యం వారిపై దాడి చేసింది.

గత జులైలో భారత సైనిక పోస్టులే లక్ష్యంగా కీరన్‌, గెరెజ్‌, మాఛిల్‌, తంగ్‌ధార్‌ సెక్టార్‌లోనూ పాక్ బ్యాట్‌ బృందం చేసిన దుస్సాహసాన్ని సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో పాక్‌కి చెందిన ఆరుగురు సైనికులు ప్రాణాల్ని కోల్పోయారు. తెల్లజెండాలతో వచ్చి వారి మృతదేహాల్ని తీసుకెళ్లడానికి భారత్‌ అవకాశం కల్పించినా పాక్‌ స్పందించలేదు.

తాజాగా అధికరణ 370రద్దు తర్వాత భారత్‌లో దాడులు చేసేందుకు పాక్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బ్యాట్‌ బృందాలతో పాటు సైనికుల రూపంలో ఉన్న ఉగ్రవాదుల్ని నియంత్రణా రేఖవెంట భారీగా మోహరించినట్లు ఇప్పటికే ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. అందులో భాగంగానే తాజా చొరబాటు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.