News

కర్తార్‌పుర్‌ కారిడార్‌.. భారత్‌, పాక్‌ కీలక నిర్ణయం

322views

కర్తార్‌పుర్‌ కారిడార్‌ కు సంబంధించి భారత్‌, పాక్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నడవాపై ఉన్న ఒప్పందాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు అంగీకరించినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ఈ నడవాను ఉపయోగించుకునే భక్తులపై ఎలాంటి రుసుము విధించవద్దని పాక్‌ను కోరినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ నడవాను ఉపయోగించుకుంటున్న భక్తులపై పాక్‌ ప్రతి ఒక్కరి నుంచి 20 డాలర్లను సర్వీస్‌ రుసుం కింద వసూలు చేస్తోంది. దీంతో భక్తులకు ఇది భారంగా మారుతోంది. ఇక ఈ కారిడార్‌ పొడిగింపు నిర్ణయం వల్ల భక్తులు నిరంతరాయంగా ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుందని విదేశాంగశాఖ పేర్కొంది.

భారతీయులు ఎలాంటి వీసా అవసరం లేకుండానే ఈ నడవా ద్వారా పాక్‌లోని పవిత్ర గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను దర్శనం చేసుకోవచ్చు. భారత్‌లోని డేరా బాబా నానక్‌ నుంచి పాక్‌లోని నరోవాల్‌ జిల్లాలో ఉన్న గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను కలుపుతూ ఈ కారిడార్‌ను నిర్మించారు. సిక్కుల గురువు గురునానక్‌ తన చివరి రోజుల్లో ఇక్కడ నివసించారు. దీంతో సిక్కులు ఈ ప్రాంతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా 2019 నవంబర్‌ 9న ఈ కారిడార్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2019 అక్టోబర్‌ 24న ఐదేళ్ల పాటు భారత్‌, పాక్‌లు ఈ నడవాపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఐదేళ్ల ఒప్పందం ముగిసిపోవడంతో మళ్లీ కాలపరిమితిని పెంచుతూ ఇరుదేశాలు ఒప్పందానికి వచ్చాయి. పార్లమెంట్‌ నివేదిక ప్రకారం.. 2022 వరకు 1,10,670 మంది భారత్‌తోపాటు, విదేశాల్లో ఉంటున్న భక్తులు ఈ కారిడార్‌ను ఉపయోగించుకున్నారు.