
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు వీరగాధ 4.0 పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా వీరగాథ పోటీలను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తోంది. ఈ పోటీలు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించి విజేతలకు ప్రశంసాపత్రంతో పాటు ప్రోత్సాహక సన్మానం చేస్తారు. రాష్ట్ర స్థాయి విజేతలకు జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలకు కేంద్ర మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రూ.10 వేలు నగదు బహుమతిగా అందజేస్తారు.
నిర్వహించే అంశాలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులందరూ ఈ పోటీలలో పాల్గొంటున్నారు. 3-5 తరగతుల విద్యార్థులకు పద్యం, 150 పదాలకు మించకుండా ఒక కథ, చిత్రలేఖనం.. 6-8 తరగతుల విద్యార్థులకు పద్యాలు, చిత్రలేఖనంతో పాటు 300 పదాల కథ.. 9-10 తరగతుల వారికి పద్యాలు, చిత్రలేఖనం, 700 పదాల వ్యాసరచన.. 11-12 తరగతుల వారికి వెయ్యి పదాలతో వ్యాసరచన, పద్యాలు, చిత్రలేఖనం, వీటితో పాటు ఒకటి, రెండు నిమిషాల నిడివితో వీడియో ప్రదర్శన పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలు ప్రధానంగా దేశభక్తి, చరిత్ర ఆధారంగా ఉంటాయి.
విజేతల ఎంపిక ఇలా..
ప్రతి పాఠశాల నుంచి నాలుగు విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన నలుగురిని వీరగాథ 4.0 పోర్టల్‌లో నమోదు చేస్తారు. పాఠశాల స్థాయిలో ఎంపికైన వారు జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో ఎంపికైన నలుగురిని రాష్ట్ర స్థాయికి, అక్కడ ప్రతిభ కనబరచిన ఎనిమిది మందిని జాతీయ స్థాయికి పంపుతారు. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగం నుంచి 25 మంది వంతున మొత్తం వంద మంది విజేతలను ఎంపిక చేస్తారు.
జిల్లా స్థాయిలో 17 నుంచి…
వీరగాథ 4.0 పోటీలు మండల స్థాయిలో ఇప్పటికే పూర్తికాగా ఈ నెల 17 నుంచి నవంబరు 10 వరకు జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో నవంబరు 12 నుంచి 30 వరకు.. జాతీయ స్థాయిలో డిసెంబరు 4 నుంచి 24వ తేదీ వరకు ఈ పోటీలు జరుపుతారు.





