NewsProgramms

తరతరాలకు స్ఫూర్తి రాణి అహిల్యాబాయి : కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ

57views

విదేశీ పాలకులు, నేటికీ కొనసాగుతున్న విదేశీ భావజాలాల ప్రతినిధులూ భారతదేశ చరిత్రను దుర్మార్గంగా వక్రీకరించారు. భారతదేశం అంటే కులవివక్ష, సతీసహగమనం, వరకట్న వేధింపులు, మహిళలపై అత్యాచారాలు, మూఢనమ్మకాలు మాత్రమే అన్నట్లు చిత్రీకరించారు. మూడువందల సంవత్సరాల క్రితమే అహిల్యాబాయి హోల్కర్ రాణిగా పరిపాలించిన దేశం మనది. రాజ్య నిర్వహణ, ఆర్థిక విషయాలు, విదేశాంగ మంత్రాంగం, ప్రజా సంక్షేమం వంటి నైపుణ్యాలతో అహిల్యాబాయి జనరంజకంగా పరిపాలించిన గొప్ప మహారాణి. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా రచించిన పుస్తకావిష్కరణ సభలో అహిల్యాబాయి ఘనకీర్తిని వక్తలు వివరించారు.

1725లో పుట్టిన అహిల్యాబాయి త్రిశతాబ్ది ఉత్సవాలు 2024 మే 31 నుంచి 2025 వరకూ జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ‘మహిళా సమన్వయం – ఆంధ్రప్రదేశ్’ సంస్థ ‘తరతరాలకు స్ఫూర్తి రాణి అహిల్యాబాయి’ పేరుతో ఆవిడ జీవితగాధను ప్రచురించింది. విశ్రాంత అధ్యాపకులు బొమ్మరాజు సారంగపాణి రచించిన ఆ గ్రంథావిష్కరణ సభ ఆదివారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగింది. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జాతీయ మానవహక్కుల కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి విజయభారతి, ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. సృజన పాల్గొన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు ‘రాణి అహిల్యాబాయి’ పుస్తకాన్ని పరిచయం చేసారు. ‘‘ప్రపంచానికి తామే నాగరికత నేర్పామని భావించే విదేశీ పాలకులు భారతదేశ ఘన చరిత్రను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారు. మూడు శతాబ్దాల క్రితమే దేశంలోని ప్రధాన సంస్థానానికి రాణిగా వ్యవహరించిన అహిల్యాబాయి హోల్కర్ భారతీయ సంస్కృతి పరిరక్షణ లక్ష్యంగా ప్రజల సంక్షేమమే ఊపిరిగా జనరంజకంగా పరిపాలన చేసారు. యాదవ వంశీయులైన నాటి ఇండోర్ సంస్థానాధీశులు తమ కులానికి చెందని అహిల్యను కోడలిగా చేసుకున్నారు. చిన్నతనంలోనే ఆమె భర్తను కోల్పోయినా, రాజ్య నిర్వహణాభారం ఆమెకే కట్టబెట్టారు. తర్వాత ఆమెనే రాణిగానూ చేసారు. అహిల్యాబాయి సైతం తన కుమార్తెకు 18ఏళ్ళు నిండాకే స్వయంవరం ఏర్పాటు చేసి, వివాహం చేసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉందని చాటింది. తన కుమార్తెకు భర్త అవదలచుకున్నవారికి క్షాత్రగుణాలే ప్రధానం తప్ప క్షత్రియకులమే అవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆనాటి సమాజంలో దొంగలుగా బతుకుతున్న భిల్లులు, గోండుల వంటి ఆదివాసీలను సంస్కరించింది. బాల్యవివాహాలనూ, వరకట్న పద్ధతినీ రద్దు చేస్తూ శాసనాలు చేసింది. 15 దేశాలకు రాయబారులను పంపించి విదేశాంగ విధానాన్ని సమర్ధంగా నిర్వహించింది. తన భర్తే తప్పుచేసినా ఆయననుంచీ అపరాధ రుసుము వసూలు చేసింది. ప్రాచీన ఆధునిక విధానాల సమ్మేళనంతో నవీన భావాలతో వ్యవసాయం, చేనేత, ప్రజాసంక్షేమం, దేశ భద్రత, రక్షణ, పర్యాటకం తదితర రంగాలను పటిష్టం చేసింది. విదేశీ ఆక్రమణదారులతో పోరాటాలు చేసింది. రాజ్యపాలన నిధులతో కాక తన సొంత నిధులతో దేశవ్యాప్తంగా సుమారు 150 ప్రధాన దేవాలయాలను తీర్చిదిద్దింది. కాశీలో మొగలు రాజులు కూల్చివేసి మసీదు నిర్మించినచోటనే విశ్వేశ్వరాలయం నిర్మించింది. దేశంలో హిందుత్వం కాపాడబడితేనే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని నిరూపించింది. ఎంత ప్రజాసేవ చేసినా అదంతా శివానుగ్రహమే అంటూ యావదాస్తినీ శివార్పణం చేసిన మహనీయురాలు అహిల్యాబాయి’’ అని వివరించారు. విదేశీ వలసపాలకులు, వారి భావజాలంతో నేటికీ మన దేశాన్ని ముక్కచెక్కలు చేస్తున్నవాళ్ళు ఎందరో భారతీయ మహిళామూర్తులను దాచివేసి తెరెసా వంటి విదేశీయులనే గొప్పవారిగా మన మీద రుద్దుతున్న వైనాన్ని స్పష్టంగా వివరించారు. అటువంటి కుట్రల నుంచి జాగృతం కావాలంటే అహిల్యాబాయి హోల్కర్ వంటి మహనీయుల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉందని వెల్లడించారు.

తరతరాలకూ స్ఫూర్తి రాణి అహిల్యాబాయి’ పుస్తక రచయిత బొమ్మరాజు సారంగపాణి మాట్లాడుతూ ‘‘అహిల్యాబాయి పుట్టిన 50ఏళ్ళ తర్వాత పుట్టిన జేమ్స్ మిల్ అనే ఆంగ్లధూర్తుడు భారతదేశ చరిత్రను పరిపూర్ణంగా వక్రీకరిస్తూ ‘ది హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా’ పేరిట ఆరు సంపుటాలు రచించాడు. అయితే తన కాలానికే రాణిగా ఉన్న అహిల్యాబాయి హోల్కర్ గురించి మాటమాత్రమైనా రాయలేదు. భారతదేశం అంటే వారసత్వ పరంపర, అణచివేత మాత్రమే అనే విధంగా మన చరిత్రను వక్రీకరించాడు. అటువంటి వక్రీకరణలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల విడుదలైన రజనీకాంత్ సినిమాలో భారతీయ విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిన లార్డ్‌ మకాలేకి కృతజ్ఞతలు వెల్లడించారంటే పరిస్థితి నేటికీ ఎంత దారుణంగా ఉందో, భారతీయతను వక్రీకరించే దుర్మార్గాలు ఇంకా ఎలా కొనసాగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. భారతదేశపు సుసంపన్న జ్ఞానచింతన, నవీనతను ఆహ్వానించే లక్షణాలకు నిలువెత్తు నిదర్శనమైన అహిల్యాబాయి హోల్కర్ వంటి వీరనారీమణుల గురించి మనకు తెలియకుండా తొక్కిపట్టేసారు. అటక్ నుంచి కటక్ వరకూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ యావత్ అఖండ భారతదేశమంతా అహిల్యాబాయి నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, జాతీయతావాద చింతనల స్వరూపం అహిల్యాబాయి హోల్కర్’’ అని వివరించారు.

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ‘మహిళా సమన్వయం ఆంధ్రప్రదేశ్’ కన్వీనర్ శ్రీమతి ఇరగవరపు పద్మావతి అధ్యక్షత వహించారు. మహిళా సమన్వయం విజయవాడ విభాగ్ కన్వీనర్ బి మాధురి, అరుణ శ్రీ, సాహిత్య నికేతన్ డైరెక్టర్ బి.పవన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు బాలాజీ భక్తబృందం ప్రదర్శించిన కోలాటం, చిరంజీవి బాలసరస్వతి నాట్యప్రదర్శన ఆహూతులను ఆకట్టుకున్నాయి.