News

కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దుకు విద్యార్థిలోకం సంఘీభావం

592views

కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి విద్యార్థిలోకం సంఘీభావం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూ వేడుకలు జరుపుకోవాలని భావించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న ఆర్టికల్ 370 రద్దును ‘జాతి నిర్మాణం’లో భాగంగా అభివర్ణిస్తూ బరోడాలో భారీ ర్యాలీని నిర్వహించింది. బరోడాలోని మహారాజా సయాజిరావు (ఎంఎస్) యూనివర్సిటీ నేతృత్వంలో దాదాపు 45వేల మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల్లో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన విద్యార్థులు కూడా ‘భారత్ ఏక్తా’ ర్యాలీలో పాల్గొన్నారు.
ర్యాలీని ఉద్దేశించి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మాట్లాడుతూ ‘రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలను’ మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేయడం దారుణం అంటూ తూర్పారబట్టారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను సైతం స్వాధీనం చేసుకొని జమ్మూ కాశ్మీర్ కలపడమే ధ్యేయంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా చేస్తున్న కసరత్తు చేస్తున్నారని చెప్పారు. దీనికి పార్లమెంట్ సైతం ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. వదోదర నాగరిక్ సమితి నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది. అంతకుముందు ‘భారత్ ఏక్తా కూచ్ యాత్ర’లో భాగంగా మాజీ బరోడా మహారాజా సమంజిత్‌సింగ్ గైక్వాడ్ నేతృత్వంలో జరిగిన పాదయాత్రను ముఖ్యమంత్రి విజ్ రూపాని జెండా ఊపి ప్రారంభించారు. ఎంఎస్ యూనివర్సిటీ విద్యార్థులంతా ర్యాలీలో పాల్గొనాలని యూనివర్సిటీ అధికార వర్గాలు వాట్సప్ మెసేజ్‌లు పంపారు. విద్యార్థులు, సిబ్బంది తప్పనిసరిగా ర్యాలీలో పాల్గొని సహకరించాలని రిజిస్ట్రార్ నవీన్ ఓఝా వాట్సప్ మెసేజ్‌లో పిలుపునిచ్చారు. ‘ఆర్టికల్ 370 రద్దును భారత్ నిర్మాణంలో భాగంగా తాము భావిస్తున్నందున ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతున్నామని.. అయితే, ఇందులో ఎలాంటి వత్తిడి ఉండదని’ సందేశంలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా రద్దు అంశంపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించడమే ప్రధాన ఉద్దేశమని రిజిస్ట్రార్ తెలిపారు.

Source : Andhra Bhoomi

http://www.andhrabhoomi.net/content/nation-12851

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.