
భారత వైమానిక దళం మంగళవారం ఒడిశా తీరంలో ‘అస్త్ర’ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ప్రయోగించేందుకు సుఖోయ్-30 ఎంకేఐను వినియోగించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డ ఈ క్షిపణి ఉపరితలంలో విధించిన లక్ష్యాన్ని చేధించడంలో విజయవంతం అయ్యిందని రక్షణశాఖ తెలిపింది. ఈ క్షిపణి చేరడంతో భారత రక్షణశాఖ మరింత బలోపేతం అయ్యింది. ఇక ఈ క్షిపణికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించేందుకు వివిధ పరికరాలను వినియోగించడం జరిగిందని రక్షణశాఖ పేర్కొంది. రాడార్లు, ఎలెక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టం, సెన్సార్లను వినియోగించి ‘అస్త్ర’ క్షిపణి వివరాలను దగ్గరగా పరిశీలించడం జరిగిందని చెప్పారు. ఈ పరికరాలు ఇచ్చిన సమాచారం మేరకు ఉపరితలంలో ‘అస్త్ర’ క్షిపణి విజయవంతంగా లక్ష్యాలను చేధించిందని డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇక ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను ఎయిర్‌ఫోర్స్ బృందాలను అభినందించారు.
ఒడిషా తీరంలో ప్రయోగించిన ‘అస్త్ర’ క్షిపణి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. కనుచూపు మేరలో ఉన్న ఉపరితల లక్ష్యాలను సైతం చేధించగల సామర్థ్యం ‘అస్త్ర’ క్షిపణి సొంతం. లక్ష్యాన్ని చేధించే క్రమంలో గంటలకు 5,555 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లుతుంది. 15 కేజీల భారీ పేలుడు పదార్థాలు దీని వార్ హెడ్‌లో ఉంటాయి. ఇక ఈ ‘అస్త్ర’ క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్‌డీఓ రూపొందించింది.మరో 50 ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు కూడా దీన్ని రూపొందిచడంలో కీలక పాత్ర పోషించాయి. ‘అస్త్ర’ క్షిపణులను మోసుకెళ్ళే సుఖోయ్ -30 ఎంకేఐను మోడిఫై చేసే బాధ్యత హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తీసుకుంది. సుఖోయ్ యుద్ధ విమానంకు ఈ మార్పులు చేయడంతోనే ‘అస్త్ర’ మిసైల్‌ను మోసుకెళ్లగలిగింది.
Source : One India
https://telugu.oneindia.com/news/india/iaf-successfully-flight-tests-air-to-air-astra-missile-253533.html





