
ఈ నెల 12న జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని దేవాలయ కమిటీ సభ్యులకు సూచిస్తూ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరుపు నుంచి చేయాల్సిన ఏర్పాట్లను చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో దేవరగట్టు బన్నీ ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు, దేవస్థాన కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాల సహిత మల్లేశ్వరస్వామి దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ నెరణికి, నెరణికితాండ, కొత్తపేట, దేవరగట్టు గ్రామాల ప్రజలు బన్ని ఉత్సవాలను ఎలాంటి సమస్యలు రాకుండా పండుగల్లా జరరుపుకోవాలని సూచించారు. ఎవరూ గాయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బన్నీ ఉత్సవ పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదోని సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. జేసీ బి.నవ్య మాట్లాడుతూ దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో భాగంగా సంప్రదాయం పేరుతో కొట్టుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు.




