ArticlesNews

పాకిస్థాన్ కు ‘శస్త్ర చికిత్స’ తప్పనిసరి

924views

పాకిస్థాన్ మన పొరుగు దేశంగా అవతరించడం మన దురదృష్టం. ద్వేషం ఆధారంగా పుట్టిన దేశం దాని మనుగడకు ఆ ద్వేషాన్నే అంటిపెట్టుకుని దాన్నే పెంచి పోషిస్తున్నది. భారత్ పట్ల ద్వేష భావం పాకిస్థాన్లో క్యాన్సర్ వ్యాపించినట్లుగా వ్యాపించింది. దానితో తన విధ్వంసాన్ని తానే కొనితెచ్చుకుంటున్నది. ప్రతి జాతికి కొన్ని విలువలు ఉంటాయి. కానీ పాకిస్థాన్ కు ఉన్న విలువలు ప్రతిక్రియాత్మకమైనవి. “భారతదేశాన్ని ద్వేషించు, దెబ్బకొట్టు, దాడి చెయ్యి” అనేవి ఆ విలువలు. దశాబ్దాల నుండి చేస్తున్న భారత వ్యతిరేక భావజాల ప్రచారం వల్ల, ఆ దేశస్థులు భారత్ ను తీవ్రంగా ద్వేషిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్ పట్ల దురభిప్రాయమే వ్యాప్తిలో ఉంది. పాకిస్థాన్ ను ఒక నమ్మదగిన దేశంగా ఎవరూ భావించటం లేదు. మోసానికి మారుపేరుగా పాకిస్థాన్ ను అంతర్జాతీయంగా గుర్తిస్తున్నారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ‘నయవంచన’ దాని జాతీయ విధానం అయింది. దాని డిఎన్ఏలోనే కపటం ఉంది. ప్రపంచ శాంతికి ప్రమాదకరమైన ఒక ‘ రోగ్ స్టేట్’ గా పాకిస్థాన్ ను ఈనాడు అందరూ భావిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన, మిలిటరీ నియంతృత్వం, మూకుమ్మడి మరణాలు కలుగజేసే ఆయుధాలను కలిగి ఉండడం, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం ‘రోగ్ స్టేట్’ లక్షణాలు.

1948లో ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే నన్న (స్టాండ్ స్టిల్) ఒప్పందానికి వచ్చి కూడా జమ్మూకాశ్మీర్లో కి పాకిస్థాన్ సాయుధ చొరబాటుదారులను పంపింది. 1965లో కచ్ పై అకస్మాత్తుగా దాడికి దిగింది. ఆ సంవత్సరం చివరలో కాశ్మీర్లోకి తన సైన్యాన్ని పంపింది. దానితో స్థానికులు భారత్ పై ఎదురు దాడులకు దిగుతారని అది భావించింది. ఈశాన్య భారతంలో వేర్పాటువాద శక్తులకు ప్రోత్సాహం ఇచ్చింది. ఆయుధ శిక్షణను ఇచ్చింది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ఘోరంగా దెబ్బతిన్న తర్వాత అయినా పాకిస్థాన్ బుద్ధిగా అంతర్గత అభివృద్ధిపై దృష్టి పెడుతుందని అందరూ భావించారు. అది ఉగ్రవాదులను ఎగుమతి చేయడం మొదలెట్టింది. వాస్తవాధీన రేఖను తన విద్రోహ కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకుంది. సరిహద్దు గ్రామాల ప్రజలను నిరంతరం ప్రమాదంలోకి నెట్టివేసింది. భారత్ ను విచ్చిన్నం చేయడానికి, భారత్ లో అశాంతిని నెలకొల్పడానికి పాకిస్థాన్ చేయని ప్రయత్నం లేదు. అలాంటి దేశం మన పొరుగు దేశం అవటం మన దురదృష్టం. కానీ ఎన్నాళ్ళీ కపట, దుష్ట, పరపీడన కాముక పొరుగును భరించడం?  పాక్ ను నియంత్రించటానికి మనకున్న ప్రత్యామ్నాయాలు ఏమిటి?

మొదటి ప్రత్యామ్నాయం:

ఏదో రకంగా పాకిస్థాన్ ను సంతృప్తిపరచి నెట్టుకు రావడం మొదటి ప్రత్యామ్నాయం. పాకిస్థాన్ కంటే ఎన్నో రెట్లు పెద్దది మన దేశం. అన్నిటా మనదే పైచేయి కనుక కొంచెం ఉదార వైఖరితో పాక్ దుందుడుకు చర్యలను భరించి ఏదో రకంగా నిలువరించే ప్రయత్నం చేయటం. సియాచిన్ నుండి మన సైన్యాన్ని ఉపసంహరిస్తే  పాక్ శత్రుత్వం మన పట్ల కొంత తగ్గవచ్చు అని కొందరి అభిప్రాయం. మరి కొందరి ప్రకారం కాశ్మీర్ సమస్యను పాక్ కు అనుకూలంగా  పరిష్కరిస్తే ఇరు దేశాల మధ్య శాంతి, సయోధ్యలు నెలకొంటాయని మరికొందరి అభిప్రాయం. తెర వెనుక దౌత్యం నెరపే మేధావులు ఈ రకమైన ఆలోచనలు చేస్తుంటారు. వారందర్నీ పాకిస్థాన్ ఏదో రకంగా పోషిస్తూ ఉంటుంది. వారిని చర్చలు, గోష్టుల పేరుతో పూర్తి ఖర్చులు ఇచ్చి పాక్ కు పిలుస్తుంటారు. వారికి ఐదు నక్షత్రాల హోటళ్లలో బస ఏర్పాటు చేస్తారు. వారు పాకిస్థాన్ చెప్పిన మాటలనే ఇక్కడ కూడా చెబుతూ భారత ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తుంటారు. మరి కొందరు సాంస్కృతిక, క్రీడా సంబంధాలను కొనసాగించాలని చెప్తుంటారు. సునీల్ గవాస్కర్, షారుక్ ఖాన్ వంటివారు ఆ కోవలోకే వస్తారు. కానీ పాకిస్థాన్ గత 70 ఏళ్ల నుండి దుశ్చర్యలకు, దురాగతాలకు పాల్పడుతూనే ఉంది. దాన్ని సంతృప్తిపరచడం అంత తేలిక కాదు. వాస్తవానికి అది పరోక్షంగా భారతదేశం మీద యుద్ధం చేస్తూనే ఉంది. 1948లో ఏకపక్షంగా కాల్పుల విరమణ చేయటం, 1965లో కీలకమైన ‘హాజీ పీర్’ ను పాకిస్తాన్ కు ఇవ్వడం, 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో పట్టుబడిన 93 వేల మంది పాక్ యుద్ధ ఖైదీలను విడుదల చేయడం, పాక్ కు ‘ మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదా కల్పించడం వంటి చర్యలు ఎన్ని చేపట్టినా, అన్నీ విఫలమయ్యాయి. వాజపాయి లాహోర్ కు బస్సు యాత్ర చేసి శాంతి,  సద్భావనకు  పూనుకోగా, 1999లో పాక్ కార్గిల్ యుద్ధానికి కాలు దువ్వింది. నవాజ్ షరీఫ్ పుట్టినరోజు వేడుకకు నరేంద్ర మోడీ లాహోర్ కు వెళ్లిన కొన్నాళ్లకే పఠాన్ కోట్ వైమానిక స్థావరం పై దాడులకు దిగింది.

‘కుక్క తోక వంకర’ చందంగా భారత దేశం పట్ల పాకిస్థాన్ ద్వేషం ఏమాత్రం తగ్గలేదు. ఎన్నో శాంతి కాముక చర్యలను మన దేశం చేపట్టినా పాకిస్థాన్ బుద్ధి మాత్రం మారలేదు. పాకిస్థాన్ సరిదిద్దబడడానికి వీలు కాని ఒక పెద్ద మోసపూరిత, కుటిల దేశంగా మారిపోయింది. నిజానికి కాశ్మీర్, సియాచిన్ అంశాలు దాని శాశ్వత ద్వేషానికి కారణాలు కావు. దాని మూల సిద్ధాంతమే ద్వేషపూరితమైనది. కాశ్మీర్, సియాచిన్ అంశాలు ద్వేషాన్ని రెచ్చగొట్టటానికి, భారత్ లో అశాంతిని రగిలించటానికి పాకిస్థాన్ కు సాకులు మాత్రమే. పాకిస్థాన్ సమీప భవిష్యత్తులో మారుతుంది అనుకోవడం కూడా ఒక భ్రమ. ఒకవేళ కాశ్మీర్ ను, సియాచిన్ ను వెండి పళ్లెంలో ఉంచి పాకిస్థాన్ కు ఇచ్చినా, మన దేశాన్ని ద్వేషించడానికి, మనపై యుద్ధానికి కాలు దువ్వడానికి అది కొత్త కారణాలను వెతుక్కుంటుంది.

రెండవ ప్రత్యామ్నాయం:

దీని ప్రకారం పాక్ మనపై దాడులు చేసినప్పుడు మనం మనల్ని రక్షించుకుంటాం, కానీ ప్రతీకార దాడులకు పాల్పడటం. ఇది నిన్న మొన్నటి ప్రభుత్వాలు అనుసరించిన విధానం. ఆ కారణంగా 1990 నుండి కాశ్మీర్ లో 50 వేల మంది చనిపోయారు. ఇందులో సామాన్య పౌరుల నుండి సైనికాధికారులు వరకు ఉన్నారు. మన భద్రతా దళాలకు పెద్దపెట్టున ఆయుధాలు దొరికాయి. గత 15 సంవత్సరాలలో 34 వేల ఏకే-47 రైఫిళ్లు, ఐదువేల గ్రనేడ్ లాంచర్లు, 90 మెషిన్ గన్లు, 12వేల రివాల్వర్లు, 350 మిస్సైల్ లాంచర్లు, లక్ష గ్రనేడ్ లు, 63 వేల కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి.  అంతేకాక ట్యాంకులను, యుద్ధ విమానాలను పేల్చగల ఆయుధాలు సైతం దొరికాయి. అయితే ఈ విధానం వలన ప్రాణ నష్టం అపారంగా ఉంది. అంతేకాక ఆయుధాల మీద పెట్టే వ్యయం కూడా పెరుగుతున్నది. మన సహనం, ఎదురు దాడులకు దిగకపోవడం, మన మీద దాడి చేసినప్పుడు మాత్రమే ఎదుర్కోవడం వల్ల పాక్ మరింతగా బరితెగిస్తున్నది. ఎదురు దాడులకు దిగలేని ఒక అసమర్ధ రాజ్యంగా భారత్ ను భావించి, మన పట్ల వ్యతిరేకతను, ద్వేషాన్ని తన పౌరులకు నూరి పోస్తున్నది.

మూడవ ప్రత్యామ్నాయం:

పాక్ వంటి దేశాలు అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించవు. అంతేకాక చైనా వంటి దేశాల మద్దతుతో వాటిని నిస్సిగ్గుగా అతిక్రమిస్తూ ఉన్నాయి. దానికి తెలిసిన భాష బలంగా దాని నడుము విరగొట్టడమే. భారత్ కు వ్యతిరేకంగా చేసే ప్రతి దుశ్చర్యకు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పాకిస్థాన్ కు తెలిసేలా మన చర్యలు ఉండాలి. ఏ రకమైన అతిక్రమణకు పాక్ పాల్పడినా వెనువెంటనే ప్రతీకార చర్యలకు పూనుకోవాలి. ఎదురు దాడులకు దిగాలి. సర్జికల్ స్త్రైక్స్, బాలాకోట్ మెరుపుదాడులు వంటి వాటి ద్వారా ఇది కొంతవరకూ ప్రస్తుతం జరుగుతూ ఉన్నా పాక్ వంటి దుష్ట దేశానికి ఇది సరిపోదు. పాక్ తో  దౌత్య  సంబంధాల స్థాయిని తగ్గించుకోవాలి. రైలు, రోడ్డు సంబంధాలు కొన్నాళ్ల పాటు పూర్తిగా నిలిపివేయాలి. ఆ దేశంతో సాంస్కృతిక, క్రీడా సంబంధాలను పెట్టుకోకూడదు. ప్రస్తుతం చేస్తున్నట్లు గానే అన్ని అంతర్జాతీయ వేదికల మీద పాక్ ను ఒంటరిని చెయ్యాలి. వర్ణవివక్షకు పాల్పడ్డ దక్షిణాఫ్రికాకు పట్టిన గతే ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే పాక్ కు కూడా పట్టాలి. పాక్ ను ముక్కలు, ముక్కలు చేయడమే లక్ష్యంగా భారత్ పని చెయ్యాలి. వాస్తవానికి ఆ పని ఎప్పుడో చేయవలసింది. ప్రత్యేక బెలూచిస్తాన్ కోసం జరుగుతున్న వేర్పాటు ఉద్యమాన్ని భారత్ బలపరచడం అవసరం. పాకిస్థాన్ ‘కాశ్మీర్ విముక్తి ఉద్యమాన్ని’ తలకెత్తుకున్నప్పుడు మనం ఎందుకు ‘బెలూచి విముక్తి ఉద్యమాన్ని’ బలపరచ కూడదు? తన స్వాతంత్ర్య దినాన్ని‘కాశ్మీర్ విమోచన’కు అంకితం చేసిన పాకిస్థాన్ కు ధీటైన సమాధానం చెప్పాలంటే మనం కూడా మన గణతంత్ర దినోత్సవం నాడు బెలూచి,  గిల్జిత్, బాల్టిస్థాన్, ఆక్రమిత కాశ్మీర్ల విమోచనకై ప్రజల చేత ఎందుకు ప్రతిజ్ఞలు చేయించకూడదు? అలాగే సింధు రాష్ట్ర ప్రజల స్వయం నిర్ణయాధికార ఆకాంక్షను ఎందుకు బహిరంగంగా బలపరచకూడదు? బెలూచిస్థాన్, గిల్జిత్, బాల్టిస్థాన్, ఆక్రమిత కాశ్మీర్, సింధు ప్రాంతాల ప్రజల స్వతంత్ర పిపాస గురించి, అక్కడ పాక్ ప్రభుత్వం చేస్తున్న దారుణాల గురించి పెద్దపెట్టున ప్రజలకు తెలియజేయాలి. వారి స్వాతంత్ర్య ఉద్యమాలపై చర్చలు, గోష్టులు నిర్వహించాలి. పాకిస్థాన్ ను ఎన్ని ముక్కలు చేయడానికి వీలవుతుందో అన్ని ముక్కలు చేయడానికి వీలుగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు రచించి అమలు చేయాలి.

ఏకపక్షంగా ఎవరూ శాంతిని నెలకొల్పలేరు. రాజీలేని ద్వేషాన్ని, శత్రుత్వాన్ని దశాబ్దాలపాటు ప్రదర్శిస్తున్న పాక్ తో శాంతి , సయోధ్యలు ఒట్టి మాట. పాకిస్థాన్ ను సృష్టించిన భావజాలమే అటువంటిది. ‘పవిత్రులు’ అవిశ్వాసుల తో కలసి ఉండలేరనే సిద్ధాంతమే పాక్ కు ప్రాణం పోసింది. పాకిస్థాన్ మారుమనసు పొంది నాగరికమౌతుందనుకోవడం పెద్ద పొరపాటు. పాకిస్థాన్ చర్చలకు రాదు. చర్చల ద్వారా పరిష్కారానికి అది వస్తే “ద్విజాతి సిద్ధాంతం తప్పు” అని ఒప్పుకున్నట్టే. అందుకే పాకిస్థాన్ ఎప్పటికీ దొంగ దెబ్బ తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నయవంచనకు పాల్పడుతుంది. నమ్మక ద్రోహానికి పాల్పడే శత్రువుకు అర్థమయ్యే భాషలోనే జవాబు చెప్పాలి. ప్రతీకారమే పాకిస్థాన్ కు అర్థమయ్యే భాష. సమగ్ర పాకిస్థాన్ మన ఉనికికి ప్రమాదకారి. పాక్ విచ్ఛిన్నమే లక్ష్యంగా మనం పని చేయాలి. శాంతి సౌభాగ్యాలతో మన దేశం వృద్ధి చెందాలంటే పాక్ ను బలహీనపరచక తప్పదు. విచ్ఛిన్నం చేయకా తప్పదు. మామూలు మందులకు తగ్గని మొండి వ్యాధులకు ‘శస్త్ర చికిత్స’ తప్పనిసరి. ద్వేషం అనే క్యాన్సర్ నరనరాన వ్యాపించిన పాకిస్థాన్ కు ‘శస్త్రచికిత్స’ చేయకపోతే అణు యుద్ధానికి కూడా అది వెనుకాడదు.

రచన : డాక్టర్ బి. సారంగపాణి.

[ఈ వ్యాసం 8 – 9 – 2019 తేదీన ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైనది]

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.