శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేదారిపురంలో ఇటీవల పశువులు అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమంగా తరలించేందుకు వ్యాన్‌లో సిద్ధంగా ఉన్న 23 పశువులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పల్నాడు జిల్లాకు తరలిస్తున్నట్టు తెలిసింది.
..ఇలా జిల్లా నుంచి పెద్ద మొత్తంలో పశువులు ఇతర ప్రాంతాల్లోని కబేళాలకు తరలిస్తున్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జాతీయ రహదారులను కేంద్రాలుగా చేసుకొని తరలిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా కవిటి మండలం కొజ్జిరియా, రాజపురం, తొత్తిడిపుట్టుగ, శిలగాం, నర్తుపుట్టుగ తదితర గ్రామాల నుంచి పశువులు తరలిపోతున్నాయి. కొనుగోలుదారుల విషయం అసలు బయటకు తెలియదు. రైతుల రూపంలో గ్రామాల్లోకి వస్తారు. ముఖరాంపురంతో పాటు మిగతా సంతల్లో రైతుల నుంచి పశువులను కొనుగోలు చేస్తారు. వాటిని జాతీయ రహదారి సమీపంలో ఖాళీ ప్రదేశాల్లో ఒక దగ్గరకు చేర్చుతారు. రాత్రిపూట లారీలు, ఇతర వాహనాల్లో కుక్కి తరలిస్తుంటారు. మరికొందరైతే కంటైనర్లలో రహస్యంగా తరలించుకుపోతారు.
– వారపు సంతల నుంచే..
జిల్లాలో వారపు సంతలు అధికం. లావేరు మండలం బుడుమూరు, రణస్థలం మండలం రావాడ, జలుమూరు మండలం నారాయణవలస, ఆమదాలవలస మండలం చింతాడ, కంచిలి మండలం అంపురం, ముఖరాంపురంలో ప్రతీ వారం ఏదో ఒకరోజు సంతలు జరుగుతుంటాయి. వీటికితోడు ఒడిశాలోని పర్లాకిమిడి, చీకటి ప్రాంతాల్లో సైతం సంతలు ఉన్నాయి. ఇక్కడ వారంవారం లక్షలాది రూపాయల పశు విక్రయాలు జరుగుతుంటాయి. సాధారణంగా రైతులు వ్యవసాయ పనుల కాలంలోనే పశువులను పెంచుకుంటారు. పాలు ఇచ్చిన సమయంలో పాడి పశువులను పెంచుతారు. వ్యవసాయంలో యాంత్రీకరణ వచ్చిన తరువాత పశువుల పెంపకం తగ్గింది. క్రమేపీ పశువులను రైతులు విక్రయిస్తున్నారు. దీంతో దళారులు రంగ ప్రవేశం చేసి రైతుల రూపంలో వాటిని కొనుగోలు చేస్తున్నారు. కబేళాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
– కానరాని నిబంధనలు
పశువుల తరలింపు, రవాణాకు అనుమతి పత్రాలు తప్పనిసరి. సుదూర ప్రాంతాలకు వ్యవసాయ పనుల నిమిత్తం, పాడి అవసరాలకు తరలిస్తున్నామని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి అనుమతి తీసుకోవాలి. వాహనాల విషయంలో సైతం నిబంధనలు పాటించాలి. పశువులు ఎక్కడానికి, దిగడానికి వాహనాలు అనువుగా ఉండాలి. గాలి, వెలుతురు ఉండేలా చూడాలి. వైద్య కిట్లు వాహనంలో అందుబాటులో ఉండాలి. సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నట్టు అయితే పశుగ్రాసం ఉంచాలి. అవి నిల్చునే వెసులబాటు ఉండాలి. కానీ జిల్లాలో ఇవేవీ పాటించిన దాఖాలాలు లేవు. రవాణా విషయంలో కనీస స్థాయిలో కూడా నిబంధనలు పాటించడం లేదు. ఒకే వాహనంలో 40 నుంచి 50 పశువులను కుక్కి తరలిస్తున్నారు. దారిపొడవునా కనీసం వాటికి ఆహారం వేయడం లేదు. దీంతో ఆకలి, దప్పికతో అలమటించే పశువులు మార్గ మధ్యలో మృత్యువాతపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు, పశుసంవర్థక శాఖ, ఇతర అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మూగజీవాలను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
తనిఖీలు ముమ్మరం..
జాతీయ రహదారిపై తనిఖీలు ముమ్మరం చేశాం. పశువులు తరలించే వాహనాలను తనిఖీ చేస్తున్నాం. అన్నిరకాల అనుమతులు, వ్యవసాయ పనుల నిమిత్తం తరలిస్తున్నారని తేలాక విడిచిపెడుతున్నాం. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను నిలిపివేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలపై సైతం దృష్టిపెట్టాం.– మీసాల చిన్నంనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం