ArticlesNews

ఆదిగురువు వ్యాసుడు

50views

యోగ సంప్రదాయంలో పరమశివుడే ఆదిగురువు. ఆయన తాండవం చేసే సమయంలో చేతిలో ఉన్న డమరుకం నుంచి నాదం, ఆ నాదం నుంచి వేదం ఆవిర్భవించాయి. ఈ వేదాన్ని శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవుడికి, బ్రహ్మ తన కుమారుడైన వశిష్టమహర్షికి, ఆయన తన పుత్రుడు శక్తిమహర్షికి, ఆయన తన పుత్రుడు పరాశరమహర్షికి, ఆయన తన కుమారుడు వ్యాసమహర్షికి ఉపదేశించారు. ఈ మధ్యలో అనేక యుగాలు గడిచాయి. కానీ వేదం గ్రంథస్థం కాలేదు. గురువు చెబితే విని మాత్రమే నేర్చుకునేవారు. శ్రుతి అంటే వినడం. అందుకే వేదాన్ని ‘శ్రుతి’ అన్నారు. అప్పటి వరకూ మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి సాగిన వేదజ్ఞానాన్ని వ్యాసుడు సమీకరించాడు. ఒకటిగా ఉన్నదాన్ని నాలుగు విభాగాలు చేశాడు. సకల విద్యా పారంగతుడు, సర్వకళా కోవిదుడు అయిన వ్యాసుడు ఆది గురువుగా విఖ్యాతుడయ్యాడు. వేదాన్ని గ్రంథస్థం చేయడమే కాదు.. భారత, భాగవతాలు, అష్టాదశ పురాణాలు రచించాడు. ఉపనిషత్తులు, భగవద్గీత, విష్ణు సహస్రనామాలు ఆయన లిఖించినవే. ఆయన లోకానికి ఉపకారం చేయడానికై భగవత్ప్రేరణతో జన్మించాడు.