News

అగ్ని క్షిపణి రూపకర్త కన్నుమూత

43views

భారత్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పెస్‌ ఇంజనీర్‌ రామ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ ఇక లేరు. 84 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని నివాసంలో గురువారం(ఆగస్టు 15) ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. భూతల క్షిపణి.. భారత క్షిపణుల్లో మణిహారంగా పేర్కొనే ‘అగ్ని’ని రూపొందించడంలో ఈయనదే ప్రముఖ పాత్ర. అందుకే ఆర్‌ఎన్‌ అగర్వాల్‌ను ఫాదర్‌ ఆఫ్‌ ది అగ్ని సిరీస్‌ ఆఫ్‌ మిస్సైల్స్‌గా పిలుస్తుంటారు.

కాగా రామ్ నారాయణ్ అగర్వాల్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో వ్యాపారుల కుటుంబంలో జన్మించారు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా (AGNI), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ డైరెక్టర్‌గా పనిచేశారు.

అగర్వాల్ 1983 నుంచి అగ్ని ప్రయోగానికి నాయకత్వం వహించారు. ఆయన చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ, 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌ అవార్డులతో సత్కరించింది. రక్షణ రంగంలో దేశం కోసం కృషి చేసిన ఆయన.. స్వాతంత్ర దినోత్సవం నాడే కన్నుమూయడం గమనార్హం.