ArticlesNews

చైనా కుయుక్తులకు ఇండియా తిరుగులేని కౌంటర్ చెన్నై టు ‘వ్లది వొస్తోక్’

228views

చైనా ఆధిపత్య పోకడలకు ఇండియా ఎంత జాగ్రత్తగా కౌంటర్లు ప్లాన్ చేస్తున్నదో ఎలా రిస్క్ తీసుకుంటున్నదో చెప్పే కథనం ఇది. ‘వ్లది వొస్తోక్’ ఈ పేరు విన్నారా? గత సంవత్సరం సుష్మా స్వరాజ్ రష్యా వెళ్లారు. ఓ కీలకమైన ఒప్పందంపై సంతకాలు చేశారు. అది దూర ప్రాచ్యం అనగా దూరంగా ఉండే తూర్పు ప్రాంతాలపై కన్ను వేయడం. ఈ ఒప్పందాల వెనుక ప్రస్తుత విదేశాంగ మంత్రి జయశంకర్ వ్యూహరచన ఉంది. వెనుకనుంచి అజిత్ దోవల్ లాబీయింగ్ ఉంది. అన్నిటికీ మించి చైనా కుయుక్తులకు కౌంటర్ ఉంది. పాకిస్తాన్ గీకిస్తాన్ కాదు. ఇండియాకు అసలు సిసలు త్రెట్ చైనా. జిన్ పింగ్, మోడీ కౌగిలించుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకోగానే సరిపోదు. లోపలి మర్మం చాలా ఉంటుంది.

మొన్న ఓ ఆర్థిక సదస్సు కోసం మోడీ వ్లది వొస్తోక్ వెళ్ళాడు. మాట్లాడాడు. అంతా అయ్యాక  పుతిన్ వచ్చి మోడీని గట్టిగా కౌగిలించుకున్నాడు. మోడీ 7,500 కోట్ల రుణం ఇస్తామని ప్రకటించారు. హ హ హ అంతటి రష్యాకు ఇండియా అప్పు పెట్టడమా? అని అందరూ నవ్వుకున్నారు. కానీ దాని వెనుక చాలా స్ట్రాటజీ ఉంది. ఇక్కడ ఇండియా దీర్ఘకాలిక, సాహసోపేత వ్యూహం ఉంది.

చాలా రోజులుగా మనం వింటున్నది ఏమిటి? చైనా అనేది మన చుట్టూ రకరకాల వలలు పన్నుతున్నది. మారిటైం సిల్క్ రోడ్ అంటుంది. ముత్యాలసరం. ఆ పేరిట మన చుట్టూ ఉన్న దేశాల్లో పోర్టులు డెవలప్ చేసి ప్రతి చోట సబ్ మెరైన్ లు, యుద్ధ నౌకల్ని మొహరిస్తుంది. క్రమేపీ హిందూ మహాసముద్రం మీద ఆధిపత్యం సంపాదిస్తుంది. ఎక్కడో గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న జిబోటిలో యుద్ధ స్థావరం నెలకొల్పి యూరప్ పశ్చిమ ప్రాంతమంతా తన ఆధిపత్యం పెంచుకునే ఎత్తుగడ అది. ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముక హిందూ మహాసముద్రం. దాని గుండా సరఫరా అయ్యే చమురు దాని టార్గెట్. అదే కాదు ఇది కాస్త చూడండి ఓసారి.

బీజింగ్ నుంచి భూటాన్ లో తను కబ్జా చేసిన లాసా మీదుగా తన గుప్పిట్లోకి తెచ్చుకున్న నేపాల్ దాకా రోడ్డు. ‘ఉత్తరాఖండ్ దాకా విస్తరిద్దాం బ్రదర్’ అంటూ జోకులు కూడా వేసుకుంటుంది చైనా. జియాన్ నుంచి దుషాంబే (తజకిస్థాన్) మీదుగా గల్ఫ్ దేశాల దాకా రోడ్డు. మొత్తం యూరప్, ఆసియా వాణిజ్యాన్ని గుప్పెట్లో పెట్టుకునే దారి. ఖష్గర్ నుంచి పాకిస్తాన్ లోని గ్వదర్ పోర్టు దాకా ఓ రోడ్డు.  అది మన కాశ్మీర్ మీదుగా వెళ్తుంది. అది ఒక త్రెట్. చైనా – పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్, ట్రాన్స్ హిమాలయన్ ఎకనమిక్ కారిడార్ ఇలా ఏ పేర్లు పెట్టినా సరే దానికో ప్లానుంది. అన్ని దేశాలూ బానే ఉంటాయి. ఎటొచ్చి ఇండియాకే ప్రాణసంకటం. అనగా భద్రత సంకటం. అందుకని రిస్కు తీసుకుంటున్నది.

తనూ పోటీగా కదులుతున్నది. ఏ దక్షిణ చైనా సముద్రం మీదుగా చైనా తన ఆధిపత్య ప్రయాణం స్టార్ట్ చేసిందో అదే రూట్ లో ఇండియా కూడా రూట్ ప్లాన్ రెడీ చేసుకుంది. అండమాన్ నికోబార్ ను ఇండియా నేవీ వ్యూహ స్థావరంగా మార్చింది. చైనాతో భౌగోళిక పంచాయతీలు ఉన్న వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, తైవాన్ తదితర దేశాలతో దోస్తీ చేస్తున్నది. ఓ దేశానికి ఏకంగా అత్యంత ఆధునిక ‘బ్రహ్మోస్’ కూడా ఇస్తున్నది. ఇప్పుడిక ఏకంగా ఆ సముద్రం పక్కనుంచి చైనా సరిహద్దుల్లోని వ్లది వొస్తోక్ దాకా సముద్ర మార్గాన్ని డెవలప్ చేస్తున్నది.

“నువ్వు ఇటు పెంట పెడితే నేను నీ పక్కలో బల్లెం పెడతా” ఇదీ స్ట్రాటజీ. ఈ వ్లది వొస్తోక్ అనేది ఓ పట్టణం. రష్యాలో అంతర్భాగమే. కానీ దీనికోసం చైనా, రష్యా చాలా పోరాటాలు చేశాయి. ఓ కొమ్ము లాగా ఉండే ఈ ప్రాంతం ఉత్తర కొరియాకు, జపాన్ కు, చైనాకు సరిహద్దు. అక్కడ ఫస్టు కాన్సులేట్ ఓపెన్ చేసింది ఇండియానే. ఒకప్పుడు ఈ పట్టణంలోకి విదేశీయులకు నో ఎంట్రీ. కేవలం భారతీయులకు తప్ప. ఆ ప్రాంతాన్ని దూర తూర్పు ప్రాంతం (ఫార్ ఈస్ట్ రీజియన్) అంటారు. రష్యాలో అప్పట్లో చాలా ప్రాంతాలను రీ గ్రూపింగ్ చేశారు. ఫెడరల్ డిస్ట్రిక్స్ ప్రకటించారు. అందులో ఇది ఒకటి. ప్రత్యేక జెండా, ప్రత్యేక చట్టాలతో కాస్త స్వయంప్రతిపత్తి అనుభవిస్తూ ఉంటుంది. ఆ పోర్టును చెన్నై పోర్ట్ తో అనుసంధానించాలి అనేది ఇప్పుడు ప్లాన్. ఆసియా పసిఫిక్ రాజకీయాలకు ఈ వ్లది వొస్తోక్ ప్రాంతం అత్యంత వ్యూహాత్మక కేంద్రం.

మనం బయటికి చెప్పేది ఏమిటంటే ఇప్పుడు రష్యాకు ఇండియాకు నడుమ సముద్రం లింక్ కేవలం చుట్టూ తిరిగి 8645 నాటికల్ మైళ్ళు ప్రకటించాలి. కానీ ఇప్పటి ప్లాన్ మేరకు జస్ట్ మలక్కా జలసంధి ద్వారా 5647 నాటికల్ మైళ్ళు వెళితే చాలు. ఈ రూట్ చైనాకు పడని దేశాల మీదుగా, దక్షిణ చైనా సముద్రం మీదుగా ఉంటుంది. ఆ ఫార్ ఈస్ట్ ప్రాంతాల్లో మైనింగ్, చమురు వెలికితీత వంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఇండియా కి. ఆ ఒప్పందాలూ ఉన్నాయి మనకు. సో వాణిజ్యం రీత్యా, భద్రత రీత్యా, ప్రపంచ రాజకీయాల రీత్యా, రష్యాతో వ్యూహాత్మక సంబంధాల రీత్యా ఇది మనకు కీలకం. అందుకే ఈ 7,500 కోట్ల పెట్టుబడి. చైనా మారిటైమ్ సిల్క్ రూట్, వన్ బెల్ట్ వన్ రోడ్ అంటుంటే మనం కూడా దానికి కౌంటర్ చేసుకుంటూ పోతున్నాం. అదీ కథ. అందుకే ఈ అప్పు. అందుకే ఈ స్ట్రాటజీ. వ్లది వొస్తోక్ దాకా ఏకంగా ప్రధానే వెళ్ళాడంటే అల్లాటప్ప పర్యటన కాదుగా? దాని వెనుక ఇంత స్టోరీ ఉందన్నమాట.

Source : Muchata

చైనా కుయుక్తులకు ఇండియా తిరుగులేని కౌంటర్… చెన్నై టు వ్లదివొస్తోక్..!!