
శ్రీలంకలో జరిగిన ‘యూనిసెఫ్’ సమావేశంలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాలని పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భారత ప్రతినిధులు తిప్పికొట్టారు. మంగళవారం కొలంబోలో చిన్న పిల్లల హక్కులపై యూనిసెఫ్‌లో సౌత్ అసియా పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పాక్ ప్రతినిధులు కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. జమ్మూ-కాశ్మీర్‌కు ఇంత కాలంగా ఉన్న 370-అధికరణను రద్దు చేయడం, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం తదితర అంశాలను ప్రస్తావించే ప్రయత్నాన్ని చేశారు. దీంతో భారత్ నుంచి వెళ్ళిన ప్రతినిధుల బృందం సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. భారత్ ప్రతినిధుల బృందంలో సభ్యులైన బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పాక్ చర్యలను అడ్డుకున్నారు. అనంతరం సంజయ్, గొగోయ్ మీడియాతో మాట్లాడుతూ పాక్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చూపించాలని పాక్ ప్రయత్నిస్తున్నదని, పైగా చిన్న పిల్లలకు సంబంధించి యూనిసెఫ్ సదస్సులో జమ్మూ-కాశ్మీర్ అంశాన్ని పాక్ ప్రస్తావించాలనుకోవడం దురదృష్టకరమని వారు విమర్శించారు.





