ArticlesNews

భారతదేశపు ఉక్కు మనిషి దాదాబాయి నౌరోజీ

1.3kviews

“భారతదేశపు ఉక్కు మనిషి”గా పేరుగాంచిన దాదాబాయి నౌరోజీ 1825 సెప్టెంబర్ 4 న పార్శీ కుటుంబంలో జన్మించారు. ఆయన ఒక విద్యా వేత్త, మేధావి, వ్యాపారి, రాజకీయ నాయకుడే కాక ఒక సామాజికవేత్త కూడా. ఆసియా ఖండం నుంచి బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి. ఆయన 1892 నుండి 95 వరకు బ్రిటన్ పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామర్స్ (దిగువ సభ) కు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన వ్రాసిన “పావర్టీ అండర్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా” అనే పుస్తకం భారతదేశ సంపద బ్రిటన్ కు ఏ విధంగా తరలిపోతున్నది సవివరంగా తెలియజేస్తుంది. దీనినే “డ్రెయిన్ థియరీ” అంటారు.

1867లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఎదుట శ్రీ నౌరోజీ మాట్లాడుతూ “మీ యూరోపియన్లందరూ భారతదేశ భౌతిక, ఆధ్యాత్మిక సంపదను సమర్ధవంతంగా పీల్చి పిప్పి చేస్తున్నారు. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మీరు సంగ్రహించినవన్నీ తీసుకెళ్ళిపోతారు.” అన్నారు. మరో సందర్భంలో “ యూనివర్సిటీల నుండి ప్రతి సంవత్సరం బయటకు పంపబడుతున్న వేలాది భారతీయ విద్యార్థులకు వారి స్వంత భూమిలోనే సరియైన స్థలం లభించక అయోమయ స్థితిలో ఉంటున్నారు. దానివలన యువత శక్తియుక్తులనణచే నియంతృత్వం, విధ్వంసం, వినాశనం నెలకొంటున్నది.

దాదాబాయి నౌరోజీ గురించి బాలగంగాధర తిలక్  మాట్లాడుతూ “28 కోట్ల మంది భారతీయులందరం ఏకగ్రీవంగా బ్రిటన్ పార్లమెంటుకు నిస్సందేహంగా ఎన్నుకోదగిన, ఆ పదవికి వన్నె తెచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు దాదాబాయి నౌరోజీ మాత్రమే” అన్నారు. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నుకోబడిన మొట్టమొదటి భారతీయుడు దాదాబాయి నౌరోజీ. భారతదేశపు స్వాతంత్ర్య నినాదాన్ని బ్రిటిష్ పార్లమెంటు వరకు తీసుకెళ్ళిన  ఘనుడు దాదాబాయి నౌరోజీ.