
(ఆగష్టు 4 – జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి )
సమాజం ఒక సమ్మున్నత దిశలో పురోభివృద్ధి చెందడానికి సాహిత్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందరో కవులు, రచయితలు తమ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారు. సమాజంలో వినూత్న కదలికలను కలిగించే శక్తి సామర్థ్యాలు ఉన్నవారిని గొప్ప కవులని పిలుస్తాం. అటువంటి గొప్ప కవులలో ఒకరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆయన రచనల్లో సమకాలీన ధోరణి, సులభమైన శైలి కనిపిస్తాయి. సాహితీలోకంలో కరుణశ్రీ అనే కలం పేరుతో ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు లక్షల సంఖ్యలో అమ్ముడయ్యాయంటే ఆయనకు ఉన్న ప్రజాకర్షణ ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.
కరుణశ్రీ కవితలో సారళ్య, తారళ్యాల తర్వాత ప్రధానంగా కనిపించేది కరుణ రసావేశం. నవ రసాలలో కరుణ వైపే ఆయన మొగ్గు చూపారు. ‘‘ఏకో రస: కరుణ ఏవ’’ అన్న భవభూతి వాక్కు కరుణశ్రీకి వేదవాక్కు. కరుణకు, కవికి అవినాభావ సంబంధం ఉండాలని తన కవితకు స్ఫూర్తి కరుణ రసానిదేనని జంధ్యాల పాపయ్య శాస్త్రే స్వయంగా చెప్పారు. అందుకే కాబోలు పాపయ్య శాస్త్రి తన కలం పేరే కరుణశ్రీగా పెట్టుకున్నారు. పరమ కారుణ్యమూర్తి గౌతమ బుద్ఢుడిని ఎన్ని కవితల్లో కీర్తించారో లెక్కేలేదు.
కరుణశ్రీ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని కొమ్మూరు గ్రామంలో 1912 ఆగస్టు 4న జన్మించాడు. తల్లి పేరు మహాలక్ష్మమ్మ, తండ్రి పేరు పరదేశయ్య. కొమ్మూరులో ప్రాథమిక, మాధ్యమిక విద్య చదివిన పాపయ్యకు సంస్కృత భాషపై ఉన్న మక్కువతో భమిడిపాటి సుబ్రహ్మణ్య శర్మ, కుప్పా ఆంజనేయ శాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై అమరావతి రామకృష్ణ విద్యాపీఠములోనూ, గుంటూరులోని స్టాలు హైస్కూలులో, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో 22 సంవత్సరాలు, హిందూ కళాశాలలో 2 సంవత్సరాలు ఆంధ్రోపన్యాసకులుగా వ్యవహరించారు. విద్యార్థినీ విద్యార్థులకు విశేషమైన సేవలు అందించారు.
సంస్కృతంతో సహా ఏ భాషా ఛందస్సులో లేని సొగసు తెలుగు పద్యానిది. ఆ సొగసైన తెలుగు పద్యాన్ని సొంతం చేసుకున్న మహనీయ కవి కరుణశ్రీ. తిరుపతి వేంకట కవులు, జాషువా తర్వాత పద్య కవితను ప్రజల మధ్యకు చొచ్చుకుపోయేటట్లు చేసిన కవి శేఖరుడు పాపయ్య శాస్త్రి. సమాజ స్థితిగతులను చూసి మనసులో కలిగే స్పందనే కవిత్వం అని పూర్తిగా నమ్మే కరుణశ్రీ తన గ్రంథాల్లో సామాజిక స్థితిగతులనే ప్రతిఫలించారు. ఆయన అందించిన ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ గ్రంథాలు అటు సాహితీవేత్తలలోనే కాక ఇటు విభిన్న సామాజిక వర్గాలలో కూడా కనీవినీ ఎరుగని విధంగా చర్చనీయాంశాలయ్యాయి.
కరుణశ్రీ కవితల్లో దేశభక్తి, దైవ భక్తి రెండూ తొళికిసలాడతాయి. ఆయన రాసిన ప్రతి పద్యకావ్యం పాఠకుల్ని ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక చింతనకు దారి చూపిస్తుంది. అదే సమయంలో సమాజంలోని కష్టనష్టాలు, దుస్థితుల లోతుల్లోకి తీసుకువెడుతుంది. ఆ తర్వాత సామాజిక సమస్యలకు కొన్ని పరిష్కార మార్గాలు చూపిస్తుంది. శాంతి, సామరస్యం వంటి గుణాలతో జీవించడాన్ని నేర్పిస్తూనే సామాజిక న్యాయాన్ని, మానవతా విలువల్ని రంగరించి పోస్తుంది. కరుణశ్రీ నుండి వెలువడిన ప్రతి రచన సమాజ సమస్యల పట్ల ఆయన మానసిక స్పందన అని చెప్పొచ్చు. కరుణశ్రీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ తెలుగువారి మనసు పులకించిపోతుంది. తెలుగు సాహితీ రంగాన చెరగని సంతకంగా మిగిలిన జంధ్యాల పాపయ్య శాస్త్రి చూపించిన దారిలో నడుస్తూ సమత, మమత, కరుణ, ఆర్థ్రతలను పెంపొందించుకుందాం. జయంతి సందర్భంగా ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే మనం ఇచ్చే నిజమైన నివాళి.




