News

సకల శుభాల శ్రావణానికి దుర్గగుడి సంసిద్ధం

69views

సకల శుభాల శ్రావణం ఆసన్నమైంది. ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో సామూహిక వరలక్ష్మీవ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా ఉత్సవాల తరహాలో లక్ష్మీ గణపతి ప్రాంగణంలో క్యూలైన్లను ఏర్పాటు చేశారు. సర్వ దర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 టికెట్‌ దర్శనంలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శ్రావణ మాసం రెండో శుక్రవారమైన ఆగస్టు 16వ తేదీన దుర్గమ్మ వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 16న వరలక్ష్మీవ్రతాన్ని పురస్కరించుకుని అమ్మవారు వర లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.

3వ వారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
శ్రావణ మాసం మూడో శుక్రవారమైన ఆగస్టు 23వ తేదీన ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మీవ్రతాలను నిర్వహించేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాల గురించి భక్తుల ఆలయ సమాచార కేంద్రం, మైక్‌ ప్రచార కేంద్రం, టోల్‌ఫ్రీ నంబర్‌ కార్యాలయాల్లో ఎంక్వయిరీ చేసుకుంటున్నారు. దరఖాస్తులు ఎప్పటి నుంచి ఇస్తారని, ఎవరిని సంప్రదించాలనే విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు.

మూడు రోజులు పవిత్రోత్సవాలు
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శ్రావణ శుద్ధ చతుర్ధశి శనివారం 18వ తేదీ నుంచి శ్రావణ బహుళ పాఢ్యమి సోమవారం 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతి, 18వ తేదీ ఉదయం తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, అనంతరం స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి వారికి ఇతర ఉపాయాలలో దేవతా మూర్తులకు పవిత్ర మాలాధారణ జరుగుతుంది. ఉదయం 9 గంటల తర్వాతే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతి, కలశోద్వాసన, మహాదాశీర్వచనంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. దుర్గగుడిలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అన్ని ప్రత్యేక్ష, పరోక్ష సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. 21వ తేదీ నుంచి దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు జరిగే అన్ని ఆర్జిత సేవలు యథా విధిగా జరుగుతాయి.