ArticlesNews

సనాతన ధర్మం-విశిష్టత

150views

మానవుడు తన పరమపద సోపాన మార్గంలో సనాతన ధర్మం మరువరాదు. ఆధ్యాత్మికత మేళవించినటువంటి ఈ మార్గం వలన మానవునికి చక్కని జ్ఞానం అలవడుతుంది. అది సకల మానవాళికి మాత్రమే కాదు విశాల విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది. సనాతన ధర్మం శాంతి సమైక్యతకు సంపూర్ణంగా తోడ్పడగలదు. మనుషులంతా ఒక్కటే అన్నది సనాతన ధర్మం భావం. ఈ విషయం అందరూ గమనించాలి. ముఖ్యంగా సనాతన ధర్మంలో నడిచే మానవుడు తనలోని స్వార్థాన్ని, ఈర్ష్యా ద్వేషాలను సంపూర్ణంగా విసర్జించాలి. మానవ జన్మకు సార్థకత చేకూర్చగలగాలి.

అజ్ఞానమనే చీకటి నుండి విజ్ఞానమనే వెలుగు మార్గంలో పయనించాలంటే మానవుడు జ్ఞాన సంపద పెంపొందించుకోవాలి. ఆధ్యాత్మికత విలువలు గ్రహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మానవుడు భగవంతుని ఆరాధన సంగతి మరిచిపోయి ప్రాపంచిక విషయాలపై ఆసక్తి చూపిస్తూ భౌతికపరమైన బంధములకోసం విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. సకల లోకైక రక్షకుడు భగవంతుడు అన్న విషయం గుర్తుంచుకోవాలి. భగవత్ చింతన మరువరాదు. భగవత్ ఆరాధన ఆధ్యాత్మికతకు ఒక పునాది వంటిది. సనాతన ధర్మం అన్న సిద్ధాంతం విశాల విశ్వం అంతటా ప్రసరింపజేయాలి. అందుకు మానవ ధర్మం సంసిద్ధం కావాలి.

హిందూ ధర్మాన్ని పరిరక్షించేది సనాతన ధర్మం. దీని వలన సౌభ్రాతృత్వం, సహకారం, సమభావం వెల్లివిరుస్తాయి. సనాతన ధర్మంలో అందరూ శాంత స్వభావికులే కావాలి. కోపం, అసూయ, పగ, ప్రతీకారం, ధన వ్యామోహం, కామం, మోహం వంటి దుర్గుణాలకు దూరంగా ఉండాలి. శాంతం సముద్రం కంటే గొప్పది. సనాతన ధర్మం కూడా అటువంటిదే. మన హిందూ సాంప్రదాయం, మన హిందూ ధర్మ విశిష్టత, సనాతన ధర్మంలోని ప్రధాన సూత్రాలను మనం ప్రతినిత్యం పాటించాలి. మన ప్రాచీన సంస్కృతికి నిదర్శనం హిందూ ధర్మమైతే సనాతన ధర్మం చరిత్ర సంస్కృతికి ప్రతిరూపం కాగలదు. మానవుని సంతోషకర జీవనానికి సనాతన ధర్మం ఉత్తమం.