News

స్వాస్థ్య భారత నిర్మాణమే ‘ఆరోగ్య భారతి’ లక్ష్యం – అఖిల భారత కార్యాధ్యక్షులు డాక్టర్ రమేశ్ గౌతమ్

1.1kviews

విజయవాడలోని అయోధ్య నగర్ లో గల హైందవి భవనంలో “ఆరోగ్య భారతి” ఆధ్వర్యంలో జరిగిన “మహిళా ఆరోగ్య అవగాహనా సదస్సు”లో ఆరోగ్య భారతి అఖిల భారత కార్యాధ్యక్షులు డాక్టర్ రమేశ్ గౌతమ్ మాట్లాడుతూ కుటుంబ ఆరోగ్యం అమ్మ చేతిలోనే, అదీ వంటింటిలోనే ఉన్నదని తెలిపారు. ఆరోగ్య భారతి లక్ష్యం వైద్యం చెయ్యడం కాదని, అసలు అనారోగ్యం దరికి రాకుండా ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం, కాపాడుకోవడం కోసం ఏమి చెయ్యాలో నేర్పి స్వాస్థ్య భారతాన్ని నిర్మాణం చెయ్యడమేనని ఆయన తెలిపారు.

ఆరోగ్యనారోగ్యాలకు మనసే కారణమని, కనుక ముందు మనస్సుని, ఆత్మని ప్రశాంతంగా ఉంచుకోవాలని అన్నారు. మనుషులలో వ్యతిరేక భావనలు పెరగడం (కుటుంబ సభ్యుల పట్ల, పొరుగువారి పట్ల, సహోద్యోగుల పట్ల వ్యతిరేకత, ద్వేషం) జంతు ప్రవృత్తి (ANIMAL INSTINCT) పెరగడం (కుక్కలాగా అరవడం, నక్కలాగా ఇతరుల్ని మోసగించడం) అనారోగ్య హేతువని ఆయన అన్నారు.

స్వీయ ప్రయత్నంతో క్రోధాన్ని అదుపు చేసుకోవడం వలన, దైనందిన జీవితంలో ఎదురయ్యే వివిధ సంఘటనలను మనస్సుకి పట్టించుకోక పోవడం వల్ల మనం మన మనస్సుని ప్రసన్నంగా ఉంచుకోగలమని ఆయన తెలిపారు. 95 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే అందుకు వారి మీద పెద్దలు తెస్తున్న ఒత్తిడి, ఇతర విద్యార్థులతో పోల్చడం కారణమన్నారు. “నువ్వు మెరుగ్గానే సాధించావు” అని చెప్పడం ద్వారా పిల్లల్లో ఉత్సాహాన్ని నింపాలని, వారిని ప్రోత్సహించాలని, సకారాత్మక ఆలోచనా ధోరణిని అలవాటు చేసుకోవాలని తెలిపారు.

అనుకూలవతి, భగవద్భక్తి కలిగినది అయిన భార్య దొరికినందుకు సంత్ ఏకనాథ్ “స్వామీ నాకు వివాహం ద్వారా సత్సంగాన్ని ప్రసాదించావు” అని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పేవాడట. గయ్యాళి భార్య లభించినందుకు సంత్ తుకారాం “స్వామీ గయ్యాళి భార్యనిచ్చి నేను సంసార బంధనాల్లో చిక్కుకోకుండా నీ పైనే మనస్సు లగ్నం చేసేలా చేశావు కదా?” అని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పేవాడట. వివాహమైన వెంటనే భార్యను పోగొట్టుకున్న నర్సీ మెహతా “ స్వామీ భవ బంధాలు అంటకుండా చేసి నీ వైపుకి నన్నాకర్షిస్తున్నావు కదూ” అని భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పేవాడట. దేశంలోని వేరు వేరు ప్రాంతాలకు చెందిన ఈ ముగ్గురు మహనీయుల యొక్క ఉదాహరణతో ఎంతటి ప్రతికూల పరిస్థితులలో అయినా వ్యతిరేక భావనలకు లోనుకాకుండటమే విజయానికి, ఆరోగ్యానికి సోపానమని తెలిపారు శ్రీ రమేశ్ గౌతమ్.

అఖిల భారత ఆరోగ్య మిత్ర ప్రముఖ్ డాక్టర్ మురళీ కృష్ణ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఆరోగ్య భారతి కార్యం చాలా విస్తృతంగా జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చురుగ్గా సాగుతోందని. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య భారతి, సేవా భారతిలు సంయుక్తంగా ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు.

షుమారు 70 మంది ఆరోగ్య మిత్ర కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి క్షేత్ర (ఆంధ్ర, తెలంగాణా) సంఘటనా మంత్రి శ్రీ కుమారస్వామి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పీ.ఎస్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కృష్ణ ప్రసాద్, ఆంధ్ర ప్రాంత మహిళా సంయోజక్ శ్రీమతి రజనీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.