హిందూ దేవాలయాలలో ఉన్న అన్య మత ఉద్యోగులు స్వచ్ఛందంగా బయటకు రండి. లేకుంటే కఠిన చర్యలుంటాయి – చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం

హిందూ దేవాలయాలలో పని చేస్తున్న అన్య మతస్థులు తమకు తాముగా ఆయా విభాగాధిపతులకు రిపోర్టు చేసి ఆ విధుల నుంచి తప్పుకుని వేరే ప్రభుత్వ విభాగాలలోకి బదిలీ కావాలని ఆదేశించినట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ సెక్రెటరీ శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఇప్పుడు బయటపడకుండా వారి ఇళ్ళలో జరిగే పెళ్ళిళ్ళు, పేరంటాలు, చావులు వంటి సందర్భాలలో వారు అన్య మత ఆచారాలను అవలంబిస్తున్నాట్లుగా తేలితే వారిపై కఠిన చర్యలకు వెనుకాడబోమని కూడా శ్రీ సుబ్రహ్మణ్యం తెలిపారు. దేవాదాయ శాఖలో పని చేసే ఉద్యోగుల ఇళ్ళలో ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తామని, ఆ సందర్భంలో వారు అన్య మతాన్ని అవలంబిస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలుంటాయని శ్రీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రముఖ దేవాలయాలు, ధార్మిక సంస్థలకు చెందిన ప్రదేశాలలో అన్య మత ప్రచారం జరుగకుండా సమన్వయ కమిటీలను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారని, తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం చర్చించి సమన్వయ కమిటీ ఏర్పాట్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశమున్నదని శ్రీ సుబ్రహ్మణ్యం తెలిపారు.





