News

తమిళనాడు దేవాలయం వద్ద ప్రేలుడు – ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు

592views

దివారం 25/8/2019 న తమిళనాడు కాంచీపురం జిల్లాలోని తిరుపోరూరు సమీపంలో గల మనమతి గ్రామంలో గల గంగై అమ్మన్ దేవాలయంలో జరిగిన ప్రేలుడు వల్ల ఇద్దరు యువకులు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు.

దేవాలయం సమీపంలోని ఒక నీళ్ళు లేని గోతిలో కనిపించిన ఒక గుర్తు తెలియని వస్తువును తెరవబోయిన ఇద్దరు యువకులు హఠాత్తుగా సంభవించిన ప్రేలుడు ధాటికి తీవ్ర గాయాలవటంతో చికిత్స పొందుతూ మరణించారు. వారిలో ఒకరి పేరు సూర్య(22)గా చెబుతున్నారు. జయరాం(28), దిలీపన్(25), యువరాజ్(25), తిరుమల(22)లు గాయాలతో చెంగల్ పట్టులోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రేలుడు నమూనాలు సేకరించిన పోలీసులు IED ప్రేలుడు అయ్యుండే అవకాశముందేమోననే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాంచీపురం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ మధ్య దేవాలయాన్ని శుభ్రం చేసే క్రమంలో కొన్ని పనికిరాని వస్తువులను బయట పడేశారని, ఈ క్రమంలో దేవాలయం సమీపంలో ఒక గుర్తు తెలియని వస్తువును గుర్తించిన కొందరు యువకులు దానిని తెరిచే ప్రయత్నం చేయగా ఈ ప్రేలుడు సంభవించిందని తెలిపారు. దీనిని అన్ని కోణాలలో విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

దొరికిన పెట్టె(గుర్తు తెలియని వస్తువు)లో ఆర్మీ ఉపయోగించే ప్రేలుడు పదార్ధం ఉండి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫోరెన్సిక్ విభాగం మరింత లోతుగా పరిశీలిస్తోంది.