
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా చేశారు. 2029 మే 15 వరకూ పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన ఐదేళ్ల ముందుగానే వ్యక్తిగత కారణాలతో వైదొలిగారు. నెల రోజుల కిందటే రాష్ట్రపతికి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే ఇంతవరకూ దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్నీ వెలువరించలేదు. గుజరాత్‌లోని స్వామినారాయణ్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక కేంద్రానికి చెందిన అనూపం మిషన్‌లో నిష్కామ కర్మ యోగిగా చేరి.. ఆ కేంద్రానికి శేష జీవితాన్ని అంకితం చేయడానికి ఆయన పదవిని వదులుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2017లో యూపీఎస్సీ సభ్యుడిగా చేరిన ఆయన 2022 ఏప్రిల్ 5 నుంచి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సన్నిహిత వ్యక్తిగా మనోజ్ సోనీకి పేరుంది. గతంలో ఆయన వీసీగా పని చేశారు. గుజరాత్‌లో 40 ఏళ్ల పిన్న వయసులో ఉపకులపతిగా పని చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.