
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన 12 ఏళ్ల రవికుమార్ తన అనర్గళమైన జ్ఞాపకశక్తితో భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు పుస్తకం చూడకుండానే ఉచ్చరిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. పట్టణం ధనలక్ష్మీరోడ్‌లో నివాసం ఉన్న ఎన్‌ఆర్ రాజేశ్, శ్రీలక్ష్మీల కుమారుడు రవికుమార్ స్థానిక వాసవి విన్నర్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. బాల్యం నుంచి అపారమైన జ్ఞాపశక్తి ఉండటంతో చదువులో మేటి విద్యార్థిగా రాణిస్తున్నాడు. భగవద్గీతపై ఉన్న ఆసక్తితో మైసూరులోని దత్తపీˆఠం నుంచి ఏడు మాసాలు భగవద్గీత శ్లోకాల పఠనంపై ఆన్‌లైన్‌లో శిక్షణ పొందాడు. శిక్షణలో బోధన శ్రద్ధగా వినటంతో భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు సులువుగా చెప్పగలుగుతున్నాడు. ఏ అధ్యాయంలో ఎన్నోశ్లోకం సంఖ్య చెప్పినా వెంటనే వినిపిస్తున్నాడు. ఈ సంవత్సరం మే 18న దత్తపీఠంలో నిర్వహించిన భగవద్గీత శ్లోకాల పోటీల్లో ప్రతిభ చాటి గణపతి సచ్చిదానంద చేతులమీదుగా బంగారు పతకం అందుకున్నాడు. 2024, జూన్ 24వ తేదీన బెంగళూరు వివేకానంద విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన భగవద్గీత శ్లోకాల పోటీల్లో ప్రశంసాపత్రం, జ్ఞాపిక సొంతం చేసుకొన్నాడు. స్థానికంగా సంఘాలు, పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో పదుల సంఖ్యలో పతకాలు సాధించి అందిరిచేత శెభాష్ అనిపించుకుంటున్నాడు.





