
తిరుమలలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. ఆకతాయిలపై చర్యలు తీసుకుంటా మని ప్రకటించింది. ఆకతాయిపై ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. తమిళనాడుకు చెందిన యూట్యూబర్ వాసన్‌కి ప్రాంక్ వీడియో లు తీయడం అలవాటు. ప్రాంక్ పేరుతో పబ్లిక్‌ను ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. గతంలో బైక్‌పై సాహసాల పేరుతో ప్రయత్నం చేయగా.. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోపై హైకోర్టు సీరియస్ అయింది. అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు, అతని యూట్యూబ్ చానల్ మూసివేయాలని, అతనిపై కేసు కూడా నమోదు చేయాలని ఆదేశించింది.
శ్రీవారి భక్తులకు తమిళ యూట్యూబర్ క్షమాపణలు
శ్రీవారి ఆలయ క్యూలైన్‌లో ప్రాంక్ వీడియోలు తీసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన తమిళనాడుకు చెందిన యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ క్షమాపణలు చెబుతూ శనివారం వీడియో విడుదల చేశారు. ‘మేము శ్రీవారి భక్తులం. భక్తుల ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతో వీడియో చేస్తుండగా తోటి మిత్రుడు చేసిన చర్యలు కొందరి మనోభావాలను దెబ్బతీశాయి. దీనికి మేము మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాం. ఇకపై అలాంటి వీడియోలను తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. ఇదే వీడియోపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పట్టుకునేందుకు బృందాన్ని ఏర్పాటుచేసింది.