ArticlesNews

కరుణాత్ముడు కణ్వమహర్షి

295views

కణ్వుడు అంటే మేధావి, పురోహితుడు అని అర్థం. కరుణామయుడు. ఆయన సోదరుడు ప్రగాథుడితో కలసి అనేక వేద మంత్రాలను దర్శించాడు. ఆయన రాసిన ధర్మశాస్త్రం ‘కణ్వస్మృతి’గా ప్రసిద్ధం. గోమాతను స్తుతించే మంత్రాలూ అందులో ఉన్నాయి. అమృతానికి మూలమైన గోవును హింసించరాదంటూ గోమహిమను తెలియచేస్తాయి. ఆయనను మునికుల ‘చూడామణి'(మునులలో గొప్పవాడు)
అంటారు.

స్తోత్ర పఠనం ద్వారా దేవతలను యజ్ఞ యాగాదులకు ఆహ్వానించడం ఆయన విధి అని సాయన భాష్యం పేర్కొంటోంది. హరిద్వార్ సమీపంలోని మాలినీ నదీ తీరంలో కణ్వాశ్రమంలో నిత్యం వేదఘోష వినిపించేది. అగ్నిహోత్రాలు వెలుగుతూ ఉండేవి. తపస్సంపన్నులతో దివ్యాశ్రమంలా శాస్త్ర ప్రవచనాలు, వేదార్థ మీమాంస గోష్ఠులతో వెలుగొందేది. ఆ ప్రాంతాన్ని సందర్శించిన రాజులే కాదు.
పలువురు రుషులు ఆయనను దర్శించి, ఆశీస్సులు పొందకుండా ఉండేవారు కాదు. ఆయనతో పాటు ఆయన వంశీయులను కాణ్వాయునులు/కాణ్వులు అని వ్యవహరిస్తారు.

ఆయన వంశంలో అనేకులు రుషులుగా ప్రసిద్ధులు.ఈ రుషి ప్రస్తావన మహాభారతంలో ప్రముఖంగా కనిపిస్తుంది. మేనక, విశ్వామిత్రులు తమకు జన్మించిన శిశువును అడవిలో మాలినీ నదీతీరంలో వదలి వెళ్లగా అక్కడి పక్షులు ఆమెను సాకాయి. అది చూసిన కణ్వుడు ఆమెను అక్కున చేర్చుకున్నాడు. అదే సమయంలో ‘మేనకా విశ్వామిత్రుల ఈ తనయను పెంచు. ఆమెకు కలిగే కుమారుడు గొప్ప చక్రవర్తి అవుతాడు’ అని అశరీరవాణి పలికిందట. ఆయన చిన్నారికి ‘శకుంతల’ అని పేరుపెట్టి పాలక తండ్రిగా వ్యవహరించారు. శకుంతల యుక్తవయస్కు రాలైంది. ఒకనాడు కణ్వుడు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చిన దుష్యంత మహారాజు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. జరిగిన దానిని దివ్యదృష్టితో వీక్షించిన ఆయన ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆమెకు భరతుడనే బాలుడు కలిగాడు. కాలం గడిచినా దుష్యంతుని జాడలేక పోవడంతో, వివాహితలు ఎక్కువ కాలం పుట్టినింట ఉండడం తగదని భావించిన కణ్వుడు, శిష్యులతో శకుంతలను దుష్యంతుని వద్దకు సాగనంపాడు. సందర్భంలో ఆయన చేసిన హితబోధ జగత్ప్రసిద్ధం.

మహాభారతంలో శకుంతలోపాఖ్యానంలో ఈ విషయాలు వివరంగా కనిపిస్తాయి. నేటి తల్లిదండ్రులు తమ కుమార్తెలను అత్తవారింటికి పంపేటప్పుడు చెప్పే హితువుకు ఆయన మాటలే స్ఫూర్తి అనడంలో సందేహంలేదు.