News

యూకే పార్లమెంట్‌లో.. భగవద్గీతపై భారత సంతతి ఎంపీ ప్రమాణం

315views

ఇటీవల ముగిసిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అక్కడి పార్లమెంట్‌ దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో భారత సంతతి హవా కొనసాగింది. మొత్తం 27 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. వారిలో ఒకరైన శివాని రాజా ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వీడియోను నెట్టింట్లో షేర్ చేశారు. తాను భగవద్గీతపై ప్రమాణం చేసినట్లు వెల్లడించారు.

లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి శివాని విజయం సాధించారు. ఆమె గెలుపుతో లేబర్ పార్టీకి గట్టిదెబ్బ తగిలింది. 37 సంవత్సరాలుగా ఆ స్థానం లేబర్‌ పార్టీకి కంచుకోట. ప్రస్తుత ఎన్నికల్లో భారత సంతతి నేత రాజేశ్‌ అగర్వాల్‌ను ఓడించి, ఆ కోటను ఈ కన్జర్వేటివ్‌ నేత బద్దలు కొట్టారు. ఈక్రమంలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వీడియోను ఆమె ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్ చేశారు. ‘‘లైసెస్టర్‌ ఈస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ.. పార్లమెంట్‌లో ప్రమాణం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. రాజుకు విధేయతగా ఉంటానని గీతపై ప్రమాణం చేయడం గర్వంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ మూలాలున్న ఈ 29 ఏళ్ల శివాని వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.