
భారతీయ రైల్వే అనుంబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో దేవభూమి ఉత్తరాఖాండ్ యాత్ర, దివ్య దక్షిణ యాత్రలు నిర్వహిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్ ఎం.రాజా చెప్పారు. ఏలూరు రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యాత్రల వివరాలను ఆయన వెల్లడించారు. దివ్య దక్షిణ యాత్ర ఆగస్టు 4న ప్రారంభమై 12వ తేదీతో ముగుస్తుందన్నారు. ఈ యాత్రలో భాగంగా అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రమ్, తిరుచీ, తంజావూర్ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చన్నారు. ఈ రైలు ఆగస్టు 4న మధ్యాహ్న 12 గంటలకు ప్రారంభమై విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రైల్వేస్టేషన్‌లో ఆగుతుందన్నారు. ఈ యాత్రకు సంబంధించి స్లీపర్ క్లాస్ రూ.14,250, థర్డ్ ఏసీ రూ.21,900, సెకండ్ ఏసీ రూ.28,450గా టికెట్ ధరలు నిర్ణయించామన్నారు.
9 నుంచి ఉత్తరాఖండ్ యాత్ర
దేవభూమి ఉత్తరాఖాండ్ యాత్రలో భాగంగా భారత్ గౌరవ్ రైలు ఆగస్టు 9న ప్రారంభమై 20వ తేదీ వరకూ కొనసాగుతుందన్నారు. ఈ రైలు విశాఖపట్టణంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై రాజమండ్రి, విజయవాడలో ఆగుతుందన్నారు. యాత్రలో భాగంగా భీమాల్, అల్మోరా, కౌసని, రాణిఖేత్ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చన్నారు. యాత్ర 10 రాత్రులు,11 పగలు జరుగుతుందన్నారు. థర్డ్ ఏసీ రూ.28,020, డీలక్స్ రూ.35,340గా టికెట్ ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. యాత్రల్లో భాగంగా ప్రయాణికులకు అల్పాహారం, ఆహారం, రాత్రి భోజనం అందజేస్తామన్నారు. యాత్రల్లో భాగంగా రవాణా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఐఆర్‌సీటీసీ చీఫ్ సూపర్‌వైజర్ వీవై ప్రసాద్ మాట్లాడుతూ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైలు ప్యాకేజీలు, ఎయిర్ ప్యాకేజీలు అందిస్తున్నట్లు చెప్పారు. యాత్రల పూర్తి వివరాల కోసం బాలాజీ 92810 30714, ప్రవీణ్ 92814 95848 సెల్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.





