ArticlesNews

అభ్యుదయ భావాలకు ఆద్యుడు యోగేశ్వర శ్రీకృష్ణుడు

605views

ధర్మీయులు, ఉగ్రవాదులు,సమాజ ఘాతకులు, దేశ ద్రోహులు,  ఛాందస వాదులు వీరందరినీ అంతం చేసే ఉద్దేశ్యంతో ధరాతలంపై ఆవిర్భవించిన యోగేశ్వర శ్రీ కృష్ణుడు, పుట్టినది మొదలు అవతార సమాప్తి వరకు తన నిర్ధారిత లక్ష్యాల సాధనకు నిరంతరం శ్రమించాడు. ఆయనను ఒక ఆదర్శ విప్లవ వాదిగా చెప్పవచ్చు.  శ్రీ కృష్ణుని జీవితంలోని సమస్త లీలలు, కార్యకలాపాలు. మానవులందరికీ ప్రేరణను ఇచ్చే అద్భుత విషయాలు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణుని జీవితం పరిశీలించినట్లయితే ఆయన తన సంపూర్ణ జీవితాన్ని సమాజం యొక్క, దేశం యొక్క ఉద్ధరణ కోసం అర్పించిన మహానుభావుడు, మహా యోధుడు ఆయన. ఆజన్మాంతం నిరంతర సంఘర్షణలోనే ఆయన జీవితం కొనసాగింది. ఆదర్శాలను, సిద్ధాంతాలను నిత్య వ్యవహారిక జీవితంలో  ఆచరణలో పెట్టడానికి శ్రీకృష్ణుని జీవితం మనకి మార్గదర్శనం చేస్తుంది.

యోగేశ్వర శ్రీ కృష్ణుని జీవితయాత్ర కంసుడు విధించిన క్రూర కారాగార వాసంతో ప్రారంభమవుతుంది. అక్కడ వివిధ రకాలైన క్రూర హింసల నడుమ  జీవిస్తున్న దేవకీ వసుదేవులకు జన్మించి కారా గృహ బంధనల నుండి విడిపించు కోవడంతో అధర్మానికి, అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన సమరశంఖం పూరించాడు. కారాగారం నుండి బయటకి వచ్చి నంద గ్రామంలో సురక్షితంగా ఉన్నాడనే సమాచారం వినగానే కంసుడు అతని మద్దతుదారులయిన ఇతర రాక్షసులు అందరూ భయంతో వణికిపోయారు. నంద గ్రామంలో యశోదమ్మ ఒడిలో స్నేహితులతో కలసి ఆడుకుంటూ ఈ బాల కృష్ణుడు చేసిన సాహస కృత్యాలు అన్నీ అతని సమాజ సేవ, సామాజిక సమరసత, ధర్మ రక్షణ, స్త్రీ సంరక్షణ వీటితో పాటు ఐకమత్యంలో ఉన్న బలాన్ని అందరికీ తెలియజేశాయి.

అన్యాయానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం..

బాల స్నేహితులందరూ ఒక జట్టుగా చేరి కృష్ణుడి నాయకత్వంలో పాల కుండలను, పెరుగు కుండలను పగలగొట్టడం ఆ ఊరిలోని మోతుబరులకు వ్యతిరేకంగా ఉద్యమించడమే. ఎందుకంటే, సాధారణ గొల్లల శ్రమ ఫలితమైన పాలు, వెన్నలు కంసుడి లాంటి పాలకుల ఇళ్లకు తరలి వెళ్లిపోవడం శ్రీకృష్ణుడు గమనించి ఆ అన్యాయాన్ని తన బాల సేనతో ఎదుర్కొని,  ఆ  పదార్థాలన్నీ గ్రామంలోని అందరి ఇళ్లల్లో పంచే ఏర్పాటు చేశాడు.  ఈ కారణంగా అక్కడి రైతులు, గృహిణులు, గొల్ల పిల్లలు, గోపికలు అందరూ కృష్ణుడిని తమ వాడిగా భావించి అమితంగా ప్రేమించేవారు.” వెన్నదొంగా”అని ముద్దుగా అంటూ తమ ఆశీర్వాదాలు అందించేవారు.

      మరో సందర్భంలో కుంభవృష్టి గా వర్షం పడినప్పుడు, తన చేతి మీదుగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గ్రామం లో అందరికీ దాని కింద ఆశ్రయం కల్పించాడు.  ఇంద్రుని ఆగ్రహం వల్ల కలిగిన ఈ సంక్షోభం ద్వారా కృష్ణుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు. అది ఏమిటంటే, ఒక నాయకుడి నేతృత్వంలో అందరూ ఒక్కటై పనిచేస్తే ఎంతటి గొప్ప శత్రువునైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చు. ఇది సామాజిక సంరక్షణకు అత్యుత్తమమైన మార్గం. బాల స్నేహితులతో సంఘటితంగా సాధించిన ఈ విజయాలు క్రమశిక్షణకు ఉదాహరణలు.

బాల కృష్ణుడు తన స్నేహితులందరికీ సైనిక శిక్షణ, మల్లయుద్ధం, విశ్వాస పాత్రత, అన్యాయానికి వ్యతిరేకంగా పూర్తి శక్తులను ఉపయోగించి పోరాడటం వంటి ఎన్నో విషయాలు నేర్పాడు. ఈ కారణంగానే వీరందరూ పూతన నుండి కంస, శిశుపాలుని వరకు ఎదురైన రాక్షసులను సంహరించగలిగారు. సాధారణ ప్రజలు తమను వేధించే పాలకులను ఎదిరించే ధైర్యం పొందారు.

గోప కాంతలతో శ్రీకృష్ణుడు నిర్వహించిన రాసలీల అంతరార్ధం కూడా ఆధ్యాత్మిక దృష్టి కోణం నుండి చూసినపుడు మహిళా శక్తిని వెలికి తీయడానికి చేసిన ప్రయత్నంగా చెప్పవచ్చు. ఈ గోపికల అందరికీ నాయకురాలు రాధను శాస్త్రాలు శ్రీకృష్ణుని శక్తి రూపంగా చెప్పాయి. దీని అర్థం కాస్త లోతైనది. పరమాత్మ స్వరూపమైన శ్రీకృష్ణుడు కూడా మాతృ రూపమైన స్త్రీ సహాయాన్ని తీసుకున్నాడు. నరకాసురుని బందిఖానాలో ఉన్న 16 వేల మంది స్త్రీలను విడిపించి, వారి సంరక్షణ బాధ్యతను తానే వహించాడు. దీనిలో జాతి, ప్రాంత, అధిక, అల్ప బేధాలు లేవు. వారిని సంరక్షించి, చైతన్య పరచటమే ప్రధాన ఉద్దేశ్యం. పతిత పావన రక్షకుడై పరంధాముడనిపించుకున్నాడు.  “బేటీ పఢావో బేటీ బచావో” ఉద్దేశ్యం కూడా ఇదే కదా.

చైతన్యానికి ఆధారం.. వేణువు, సుదర్శన చక్రం.

ఈరోజుల్లో మన సైన్యాలను చూస్తే క్రమ శిక్షణ, శిక్షణ, పథ సంచలనలో వారి “బాండ్” కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ శబ్దం సైనికులకు మాత్రమే కాదు సాధారణ పౌరులకు కూడా ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది. దేశభక్తి వైపు మనలని మరలిస్తుంది. శ్రీకృష్ణుని వేణు నాదం కూడా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను తనవైపు ఆకర్షించి వారిని ఒక బంధంలో నిలిపి ఉంచి, వారంతా ఒకరికొకరు తోడుగా ఉండేలా వారిలో ప్రేమను నింపింది. శ్రీకృష్ణుడి వేణు నాదంలో కర్షకులు,కార్మికులు, స్త్రీ, బాల వృద్ధులనే బేధం లేదు. గ్రామ వాసులు, నగర వాసులనే ఆలోచన లేదు. రాజులు, ప్రజలనే భేదం లేదు. అందరూ ఒకటే. అందరి భావం ఒక్కటే.

         సమాజ రక్షణ, ధర్మ రక్షణ కోసం సమయం వచ్చినపుడు శ్రీ కృష్ణుడు వేణువు వదిలి, సుదర్శన చక్రాన్ని ధరించాడు. మహాభారత యుద్ధం ముందు, శ్రీ కృష్ణుడు పాండవుల దూతగా దుర్యోధనుడికి ధర్మోపదేశం చేయడానికి అతని దర్బారుకి వెళ్ళాడు. ఎలాగైనా యుద్ధం ఆపాలని ప్రయత్నించాడు. శాంతి ద్వారానే సమస్య పరిష్కారం ఉన్నదని భావించాడు. కేవలం ఐదు గ్రామాలు తీసుకుని సంతోష పడేలా పాండవులను ఆయన ఒప్పించ దలచాడు. కానీ “సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను. యుద్ధమే చేస్తాను” అన్న దుర్యోధనుని సమాధానంతో యుద్ధం తప్పనిసరి అయింది. శ్రీకృష్ణుడు,  భీష్ముడు, విదురుడు వంటి పండితులతో దుర్యోధనుడికి బోధ చేసే ప్రయత్నం చేశాడు కానీ, యుద్ధోన్మాదంలో ఉన్న  అతనికి ఇవి ఏవీ తలకెక్కలేదు. ఇక ఈ అవేశం తగ్గించడానికి ఒకే మార్గం  కురుక్షేత్ర రణ రంగం.

యుద్ధరంగం లో కర్మ యోగ బోధ.

       యుద్ధ రంగంలో కూడా శ్రీకృష్ణుడు ఆదర్శ రాజనీతి, యుద్ధనీతి ప్రదర్శించాడు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగనున్న యుద్ధంలో ముందు అర్జునుడికి భగవద్గీతను బోధించడం ద్వారా, సమస్త మానవాళికి కర్మ యోగాన్ని అందించడం ద్వారా ఆయన అవతార కార్యం పూర్తయింది.  మానవ జీవితంలోని సమస్త కర్మల ద్వారా వారికి సరైన దిశా నిర్దేశం చేస్తూ అంతిమ లక్ష్యమైన మోక్షం వైపు వారిని నడిపించే చక్కని మార్గం భగవద్గీత.  గీతోపదేశం ద్వారా  యోగేశ్వర శ్రీకృష్ణుడు “జగద్గురువు”గా  తన అవతార లక్ష్యాన్ని సార్థకం చేశాడు.  అర్జునుడి యొక్క ఘోర నిరాశావాదం నుండి అతనిని బయటకు తెచ్చి తిరిగి కర్మ మార్గంలో ప్రవేశపెట్టి, అతనికి దారి చూపిన శ్రీకృష్ణుడు గీతా రహస్యాన్ని సమస్త విశ్వజనులకు అందించాడు.

            శ్రీకృష్ణుడు అధర్మ పక్షం వహించిన భీష్ముడి వంటి అతిరధ, మహారధులను, దుర్యోధన, అశ్వద్ధామ, కర్ణ వంటి యోధులను సైతం అంతం చేయడానికి వెనుకాడలేదు.  శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక కర్మ యోగ జీవనం మానవుడి అన్ని సమస్యలకూ సమాధానం ఇస్తుంది. ఈ జన్మాష్టమి మహోత్సవం సందర్భంగా దేశ భక్తులైన వ్యక్తులు, సంస్థలు శ్రీకృష్ణుని జీవితాన్ని ఆయన పని విధానాన్ని ప్రేరణగా తీసుకొని, సమాజంలో ఐక్యత, దేశ భక్తి  ప్రేరేపించే విధంగా స్ఫూర్తిని కలిగి ఉండాలి.  మనపై ఎన్నో  ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. కానీ శ్రీకృష్ణుడి మీద కూడా ఎన్నో నిందలు వచ్చాయని, అయితే ఆయన వేటినీ పట్టించుకోకుండా ఎంతో సంయమనంతో తన లక్ష్యం సాధించాడని మనం గుర్తు చేసుకోవాలి. అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుంది. అసత్యం సత్యం చేతిలో తప్పక ఓడి పోతుంది. ఇదే యోగీశ్వరుడైన శ్రీ కృష్ణుని   ఉపదేశం.

హిందీ మూలం: శ్రీ నరేంద్ర సెహగల్

తెలుగు అనువాదం : పులిగడ్డ రాధాదేవి