
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర చేపట్టిన వేలాది మంది యాత్రికులలో అమెరికన్ జాతీయురాలు హీథర్ హాత్వేతో పాటు ఆమె కుమారుడు హడ్సన్ హాత్వే కూడా ఉన్నారు. సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న బర్ఫానీ బాబాను దర్శించుకునేందుకు హీథర్ హాత్వే అమర్‌నాథ్ యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా అమెరికన్ జాతీయురాలు తన కుమారుడితో కలిసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో వీడియోని పోస్ట్ చేశారు. ‘‘ఇక్కడ ఉన్నందుకు తాము ఎంతో కృతజ్ఞులమని, అమర్‌నాథ్‌కు రావాలని ఎన్నో ఏళ్లుగా కలలు కన్నామని..భారత ప్రభుత్వం మరియు పుణ్యక్షేత్రం బోర్డు కారణంగా తమ స్వప్నం సాకారం అయిందని హీథర్ స్పష్టం చేశారు. తమకు ఎంతో ఆనందంగా ఉందని, ఇక్కడివారు అందరూ అద్భుతమైనవారని, దయార్ద హృదయులని అమెరికన్ జాతీయురాలు తన వీడియోలో పేర్కొన్నారు.
వీడియోలో హీథర్ హాత్వే ఆమె కుమారుడు ఇద్దరి ముఖాల్లో ఎంతో సంతృప్తి మరియు సంతోషం స్పష్టంగా కనిపించడం ఎంతో విశేషం. హీథర్ నీలిరంగు సంప్రదాయ సల్వార్ సూట్ ధరించగా, హడ్సన్ క్యాజువల్ టీ-షర్ట్ మరియు జీన్స్ ధరించాడు. అమెరికన్ జాతీయుల వీడియోకి సోషల్ మీడియాలో అద్భుత స్పందన కనిపిస్తోంది. ఒక నెటిజన్ భక్తిలో ఎంతో శక్తి ఉందని కామెంట్ చేయగా మరో నెటిజన్ ఆ తల్లికొడుకులకు వెంటనే భారతదేశ పౌరసత్వం ఇవ్వాలని అన్నాడు.
ఇదిలా ఉంటే, ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం బర్ఫానీ బాబాని దర్శించుకున్న భక్తుల సంఖ్య 2,07,016కి చేరింది. తాజాగా 5,433 మంది యాత్రికులతో కూడిన 12వ బ్యాచ్ 213 వాహనాల్లో భగవతినగర్ బేస్ క్యాంపు నుంచి బుద్ధవారం తెల్లవారుజామున బయల్దేరారు. ఈ బృందంలో 1,117 మంది మహిళలు మరియు 18 మంది చిన్నారులు ఉన్నారు. 3,462 మంది యాత్రికులు సాంప్రదాయక పహల్గామ్ మార్గాన్ని ఎంచుకోగా 1971 మంది యాత్రికులు బాల్తాల్ మార్గంలో గుహ ఆలయానికి చేరుకుంటారని అధికారులు తెలిపారు.





