
తాజాగా భారత్-పాక్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆమె చేసిన ఒక ట్వీట్ ఆధారంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాను గుడ్‌విల్ అంబాసిడర్‌గా తొలగించాలన్న పాకిస్థాన్ డిమాండ్ పై ఐక్యరాజ్య సమితి స్పందించింది. నిజానికి భారత బలగాలు పాక్‌లో ఎయిర్ స్ట్రైక్ జరిపినప్పుడు ప్రియాంక ‘జైహింద్’అని ట్వీట్ చేశారు. అప్పటి నుంచి పాక్ ప్రియాంక మీద అక్కసు పెంచుకుంది. ఇటీవల ఆర్టికల్ 370, 35A లను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ ప్రియాంక ట్వీట్ చేశారు. దాంతో ఆమెను గుడ్‌విల్ అంబాసిడర్‌గా తొలగించాలని పాక్ ఐక్యరాజ్య సమితిని డిమాండ్ చేసింది. దీన్ని ఐరాస తోసిపుచ్చింది. ప్రియాంకకు మద్దతుగా మాట్లాడింది. తాము ఆందోళన చెందే అంశాలపై మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందని పేర్కొంది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి దీనిపై మాట్లాడారు.

‘యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్లు తమ వ్యక్తిత్వం మేరకు మాట్లాడుకోవచ్చు. ఆందోళనకు గురిచేసే, ఆసక్తి కలిగించే అంశాలపై మాట్లాడే హక్కు వాళ్లకుంది. వారి వ్యక్తిగత అభిప్రాయాలు, అభిరుచులు, చర్యలు యునిసెఫ్ మీద ఎలాంటి ప్రభావం చూపవు. కానీ యునిసెఫ్ తరఫున మాట్లాడేటప్పుడు మాత్రమే ఇలాంటివి పరిగణిస్తాం. ఇక్కడ గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉండేవాళ్లు స్వతంత్రంగానే వారి విలువైన సమయాన్ని చిన్న పిల్లల హక్కులను కాపాడేందుకు కేటాయిస్తున్నారు’అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.





