ArticlesNews

నూతన చరిత్రకు నాంది 370, 35A ల రద్దు

342views

నుషులు చేసే పనులని స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు.

1)చరిత్రలో మిగిలి పోయే పనులు,

2) చరిత్రలో కలిసి పోయే పనులు.

చరిత్రలో మిగిలి పొయే పనులు చేయడం కొందరికే సాధ్యమవుతుంది. చరిత్రలో కలిసిపోయే పనులు మనమంతా చేస్తుంటాం. కానీ కొందరు సమకాలీన సమాజాన్ని ప్రభావితం చేసే గొప్ప పనులు చేయడం ద్వారా చరిత్రలో మిగిలి పోతారు, కొందరు చెత్త పనులు చేసినా సమకాలీన సమాజాన్ని నమ్మించి గొప్పవారిగా మిగిలి పోతారు.

స్వాతంత్ర్యనంతరం కాశ్మీర్ విషయంలో మన నాయకుల వ్యవహార శైలిని ఈ విధంగా వర్గీకరించవచ్చు.

చెప్పుడు మాటలు విని తప్పుడు మార్గంలో నడిచే వాడు నీ తమ్ముడైతే కొంత కాలం ఓర్పు వహిస్తాం. కానీ తప్పుడు మార్గంలో జీవించడమే అతని జీవన శైలి అయితే ఎంత కాలం భరిస్తాం. గుడ్డిగా భారత వ్యతిరేక వైఖరే తమ జీవిత లక్ష్యంగా బ్రతికే కాశ్మీరీ వేర్పాటువాద సోదరులను 70 సంవత్సరాలుగా భరిస్తున్నాం. ఇంకా ఎన్నాళ్ళు భరించాలి?

అసలు ఏమిటి కాశ్మీర్ సమస్య? ఎవరీ వేర్పాటువాదులు? నిజానికి స్వాతంత్ర్యం వచ్చిన నాడే కానీయండి, ఈనాడే కానీయండి ఎప్పుడూ కూడా పాకిస్థాన్ ప్రజల జీవన ప్రమాణాలతో పోలిస్తే భారత ప్రజల జీవన ప్రమాణాలు ఉన్నతంగానే ఉన్నాయి. అయినా మేము పాకిస్థాన్ లోనే కలుస్తాము అంటున్నారంటే అర్థం ఏమిటి? సమస్య మూలాలు ఆర్థికమైనవి కావు. ఐనా ఇప్పటి వరకు కాశ్మీర్ అభివృద్ధి కోసమంటూ ప్రతీ ఏటా లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాము. మరి ఆ డబ్బుతో ఎవరు బాగుపడినట్లు? సూటిగా చెప్పాలంటే కాశ్మీర్ ప్రజలలోనే ఎక్కువ మంది పట్టించుకోని కాశ్మీరీల ప్రత్యేక ప్రతిపత్తి, జాతీయత అనే అంశాన్ని పట్టుకుని భారత వ్యతిరేక వైఖరే తమ జీవిత లక్ష్యంలా బ్రతికేస్తున్న వాళ్లు మాత్రమే బాగుపడ్డారు. సగటు కాశ్మీరీ పౌరుడు మాత్రం బాగుపడలేదు. సగటు కాశ్మీరీ బాగుకు అడ్డుపడేవాళ్లే కాశ్మీర్ యొక్క నిజమైన సమస్య. కాశ్మీర్ స్వాతంత్ర్యం అనే పేరు చెప్పుకుని కాయలు ఏరుకుని బాగుపడేవాళ్లే కాశ్మీరీ వేర్పాటువాదలు. సగటు కాశ్మీరీ పౌరులు చదువుకునే స్కూళ్లు అన్నీ హింసాత్మక సంఘటనలతో మూత పడగా, కాశ్మీరీ వేర్పాటువాదుల పిల్లలు మాత్రం పాశ్చాత్య దేశాల లో చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ హాయిగా బ్రతుకుతున్న తీరే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

ఏదైనా సమస్యను పరిష్కరించడానికి కొందరికి కొంత సమయం పడుతుంది. కొందరికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఇంకొందరికి చాలా సమయం పడుతుంది. అది సమస్య యొక్క తీవ్రత, దాన్ని పరిష్కరించుకొనే వారి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. భారత దేశంలో సంస్థానాల విలీనాన్ని చేస్తున్నపుడు 560 సంస్థానాలని విలీనం చేయడానికి పటేల్ కు కేవలం కొన్ని నెలల సమయం పట్టింది. మరి కేవలం1 సంస్థానపు విలీనాన్ని భుజానికెత్తుకొన్న నెహ్రూకు అందుకు ఎన్నాళ్ళు పట్టింది? స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్ళు ఐనా అది సమస్య గానే ఎందుకుంది? కాశ్మీర్ సమస్య చాలా పెద్దది అనుకోవాలా? లేక దాన్ని పరిష్కరించాలనుకున్న నెహ్రూ సామర్ధ్యం తక్కువ అనుకోవాలా?

రోగి యొక్క రోగాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న డాక్టరే సరైన మందు ఇవ్వగలడు. అలాగే కాశ్మీర్ సమస్యని నెహ్రూ అర్థం చేసుకున్న తీరు వల్లే దానికి సరైన మందు పడలేదు. సమస్య యొక్క మూలలను సరిగ్గా అర్థం చేసుకోకుండానే ఇప్పటికి కాంగ్రెస్, కమ్యూనిస్టు, లిబరల్స్ ముసుగులోని సోకాల్డ్  మేధావులు వేర్పాటు వాదుల్ని సమర్దిస్తున్నారు. అందుకే స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్ళయినా కాశ్మీర్ సమస్య  సమస్య గానే ఉండి పోయింది. నిజాం సమస్య సైనిక చర్య తో ముగిసిపోయింది. జునాగఢ్ సమస్య ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయ సేకరణ)తో ముగిసిపోయింది. మరి కాశ్మీర్ సమస్య? కొందరు కాశ్మీరీల మనసు గెలుచుకోవాలంటారు, మరికొందరు ప్లెబిసైట్ నిర్వహించలేదు కదా? అంటారు.

నిజానికి గత 72 సంవత్సరాల పైబడి కాశ్మీరీ ల మనసు గెలుచుకోవటానికి మిగతా భారతీయులు చాలా త్యాగాలే చేశారు. లక్షల కోట్లు గుమ్మరించారు. అక్కడి నుండి వచ్చిన టెర్రరిస్టులు ఎందరిని బలిగొన్నా భరించారు. ఎన్ని అఘాయిత్యాలు చేసినా సహించారు. మరి వారి మనసు మారలేదే?

ప్లెబిసైట్ నిర్వహించ లేదేమని అడిగే వారికొక ప్రశ్న? మీ ఇంట్లో ఒక సమస్య ఉందనుకోండి. దానికి పరిష్కారంగా మీకొక అభిప్రాయం ఉంది. దానిని వ్యతిరేకించే వారు మిమ్మల్ని తన్ని, మిమ్మల్ని సమర్ధించే వారిని చంపి, ఆ తర్వాత మీ అభిప్రాయం చెప్పండంటూ కమ్మగా అడిగితే మీకు ఎలా ఉంటుంది? సరిగ్గా కాశ్మీర్ లోని హిందువులది అదే పరిస్థితి.

దేశ విభజన సమయంలో ఆక్రమిత కాశ్మీర్ లోనూ హిందువులను చంపారు, మతం మార్చారు, ఇంకొందరిని తరిమి వేశారు. కాశ్మీర్ ఒప్పందం కుదిరిన తరువాత అదే పరిస్థితి. చివరికి భారత ప్రభుత్వం ఆధీనంలోని కాశ్మీర్ లోనూ అదే పరిస్థితి. మరి ఇప్పుడు ఎవరి అభిప్రాయ సేకరణ చేస్తారు? ఎప్పుడో తాతల నాడే తరిమి వేయబడ్డ హిందువుల వారసులను అడుగుతారా? లేక చంపివేయబడ్డ వారి శవాలను అడుగుతారా? మానభంగం చేయబడి మట్టిలో కలిసి పోయిన మానవతుల ఆత్మలను అడుగుతారా? కాశ్మీర్ లో 20వ శతాబ్ది తొలినాళ్ళ లో దాదాపు గా 30% శాతంగా ఉన్న ముస్లిమేతరులు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు? జునాగఢ్ లో మెజారిటీగా ఉన్న హిందువులు మైనారిటీలని తరిమివేసి ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదే? అసలు ఒప్పందన్నే గౌరవించని వాళ్లకు ఒప్పందాన్ని అమలు చేయమనే హక్కు ఎక్కడిది?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ అనే మూడు ప్రాంతలున్నట్లే కాశ్మీర్ లో జమ్మూ, కాశ్మీర్ లోయ, లద్ధాక్ అనే 3ప్రాంతాలు ఉన్నాయి. ఆంధ్రా లో తెలంగాణ వారి సెంటిమెంట్ ని గౌరవిస్తూ తెలంగాణాని విభజించి నట్లు, లద్ధాక్ వారి అభిప్రాయం గౌరవించి లద్ధాక్ ను విభజించటం తప్పు ఎలా అవుతుంది?

అసలు ఆర్టికల్ 370 అనేది సగటు కాశ్మీరీ పౌరుడి డిమాండ్ కాదు. ఐనా ఇది రాజ్యాంగంలోకి ఎలా చొప్పించబడింది? అనేది ఇప్పటికి చాలా మందికి తెలియదు. అందుకు స్వాతంత్ర్యం నాటి కాశ్మీర్ పరిస్థితులను కొంచెం తెలుసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా షేక్ అబ్దుల్లా గురించి.

ఆలిగఢ్ ముస్లిం యూనివర్సిటీలో పట్టాతో పాటు ఇస్లామిక్ అతివాదాన్ని బాగా వంట పట్టించుకొని వచ్చిన షేక్ అబ్దుల్లా శ్రీనగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసేవారు.  అవినీతి చర్యలకు పాల్పడిన కారణంగా రాజా హరిసింగ్ అతనిని ఉద్యోగం నుండి తొలగించడంతో, ముస్లిం యువకులని పోగు చేసి రాజుకు వ్యతిరేకంగా రెచ్చకొట్టటం ప్రారంభించాడు.

ఒకవైపు భారత దేశంలో విదేశీ యులైన ఆంగ్లేయులకు వ్యతిరేకంగా “క్విట్ ఇండియా” ఉద్యమం నడుస్తుంటే, కాశ్మీర్ లో స్వదేశీయుడైన రాజు హరిసింగ్ కి వ్యతిరేకంగా షేక్ అబ్దుల్లా “క్విట్ కాశ్మీర్” ఉద్యమం ప్రారంభించాడు. దాంతో రాజు షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాడు. ఈ కేసులో షేక్ అబ్దుల్లా తరుపున వాదించటానికి రాజు అనుమతి లేకుండానే నెహ్రూ కాశ్మీర్ లోకి ప్రవేశించాడు. దాంతో ఆగ్రహం చెందిన రాజు హరి సింగ్ నెహ్రూను సైతం అరెస్ట్ చేయించారు. ఇది 1946 జూన్ 22 న జరగడం గమనార్హం.

అప్పటికి రాజుగా హరిసింగ్ శక్తిమంతుడు. అప్పటికి భారత దేశానికి స్వాతంత్య్రం ఇస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. నెహ్రూ కేవలం ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మాత్రమే. స్వదేశీయుడైన కాశ్మీర్ రాజుకు వ్యతిరేకంగా ఉన్న నెహ్రూ వ్యవహార శైలిని సాటి కాంగ్రెస్ నాయకులు సైతం విమర్శించారు. ఫిబ్రవరి 20, 1947న భారత దేశానికి స్వాతంత్య్రం ఇవ్వబోతున్నట్లు బ్రిటన్ పార్లమెంట్ లో అప్పటి బ్రిటన్ ప్రధాని క్లేమెంట్ అట్లీ ప్రకటించారు. తదనంతర పరిణామాలలో పటేల్ ను కాదని గాంధీజీ  నెహ్రూను భారత ప్రధానిని చేశాడు. ఇప్పుడు భారత ప్రధానిగా నెహ్రూ శక్తి మంతుడు కాగా, రాజు హరిసింగ్ బలహీన పడ్డాడు. “ఓడలు బళ్ళు – బళ్ళు ఓడలవటమంటే “ఇదే కాబోలు.

ఇక్కడ లార్డ్ మౌంట్ బాటన్ తెరవెనుక చేసిన నీచపు కుట్రలను సైతం అర్థం చేసుకోవలసి ఉంటుంది. కాశ్మీర్ రాజులు రంజిత్ సింగ్ కాలం నుండి హరిసింగ్ వరకు ఎన్నడూ కాశ్మీర్ ను మతోన్మాదులుగా పరిపాలించ లేదు. ముస్లింలను బలవంతంగా హిందువులుగా మార్చలేదు. ఐనా రాజు పరిపాలనలో కాశ్మీరీ ముస్లింలకు అన్యాయం జరుగుతోందంటూ ముస్లింలను షేక్ అబ్దుల్లా రెచ్చకొట్టాడు. కాశ్మీరీ పోలీసు, ప్రభుత్వ, సైనిక యంత్రాంగంలోని ముస్లింలపైన ఆ ప్రభావం ఉన్నదన్నది చారిత్రక సత్యం. వారి నుండి రాజుకు సరైన మద్దతు లేకపోవడంతో హరిసింగ్ బలహీన పడ్డాడు. పరిస్థితులు ఇలా ఉంటే స్వాతంత్ర్యం పొందిన మూడవ రోజునే పాకిస్థాన్ డోగ్రా లు, కొండజాతి వారి ముసుగులో తమ సైనికుల ద్వారా కాశ్మీర్ ను అక్రమించటం ప్రారంభించింది. అంటే స్వాతంత్ర్యానికి ముందే కాశ్మీర్ ఆక్రమణకు పథక రచన జరిగిందన్నమాట. ఇదంతా మౌంట్ బాటన్ వ్యూహమే అన్నది చరిత్రకారుల అభిప్రాయం. తమ నుండి స్వాతంత్ర్యం పొందుతున్న భారత్ ఎప్పటికీ బలపడకుండా సంక్షోభంలోనే ఉండాలన్న బ్రిటిష్ వారి ముందస్తు వ్యూహంలో భాగంగానే వైస్రాయ్గా మౌంట్ బాటన్ పంపబడ్డాడు అన్నది జగమెరిగిన సత్యం.

పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా మారటంతో హరిసింగ్ భారత సహాయం కోరాడు. ముందుగా కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేస్తున్నట్లు ఒప్పందంపై సంతకం చేయమన్న పటేల్, అప్పటి RSS సర్ సంఘచాలక్ మాధవరావు సదాశివ గొళ్వాల్కర్ ల సూచన మేరకు హరిసింగ్ కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. విలీన పత్రం పై మౌంట్ బాటన్ కూడా సంతకం చేసినప్పటికీ కాశ్మీర్ కు సైన్యం ను పంపకుండా నెహ్రూ రెండ్రోజుల ఆలస్యం చేశాడు.కారణం ముందుగా అధికారాన్ని షేక్ అబ్దుల్లాకు అప్పగించమని మెలిక పెట్టాడు. ఈ విధంగా హరిసింగ్ పై తన ప్రతీకారం తీర్చుకోవడానికి నెహ్రూ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక ఆలస్యం భరించలేని పటేల్ నెహ్రూ అనుమతి లేకుండానే కాశ్మీర్ కు సైన్యం పంపటంతో పాకిస్థాన్ ఆక్రమణకు అడ్డుకట్ట పడింది. తన అనుమతి లేకుండా జరిగిన విషయాలపై కోపం కావచ్చు, షేక్ అబ్దుల్లా మీద ప్రేమ కావచ్చు, తనను అరెస్ట్ చేసిన హరిసింగ్ పై సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకొనేందుకు వచ్చిన అవకాశంగా భావించి కావచ్చు, పాక్ సైన్యాన్ని కొన్ని గంటలలో పూర్తిగా వెనక్కి తరిమేయ గల స్థితిలో ఉన్న భారత సైన్యం కాళ్ళు, చేతులు కట్టేసే విధంగా సమస్యను ఐక్యరాజ్య సమితికి అప్పగించడం ద్వారా నెహ్రూ తీసుకున్న నిర్ణయం కాశ్మీర్ ను నిప్పుల గుండం లోకి నెట్టింది.

మరో విచిత్ర మైన విషయం ఏమిటంటే 1947 అక్టోబర్ 26న కాశ్మీర్ భారత్ లో విలీన మవ్వగా కేవలం షేక్ అబ్దుల్లా డిమాండ్ మేరకు అంబేద్కర్ సైతం తీవ్రంగా వ్యతిరేకించిన ఆర్టికల్ 370 ని రాజ్యాంగ రచన మరో 10 రోజులలో పూర్తవుతుందనగా అయ్యంగార్ తో రాయించి మరీ  రాజ్యాంగంలో తాత్కాలిక ప్రాతిపదికన చేర్పించాడు నెహ్రూ. రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26న పూర్తవగా 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది.

ఆర్టికల్ 370 మరియు 35A లలోని అనుచిత మైన నిబంధనల అండతో ఆనాటి నుండి ఈనాటి వరకూ కాశ్మీర్ లో ఒక క్రమ పద్ధతిలో పాకిస్థాన్ అనుకూల వర్గాలను బలోపేతం చేస్తూ వస్తున్నారు. తీవ్రవాదుల ప్రాబల్యం ఉన్న కాశ్మీర్ లోయలోను, పాకిస్థాన్ సరిహద్దు జిల్లాలలోను జరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలకు, ఆయా జిల్లాల్లో దర్జాగా భారత పౌరసత్వం పొందిన పాకిస్థాన్ అల్లుళ్ళ మద్దతు గురించి నిఘా వర్గాలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. కారణం ఈ ఆర్టికల్ ప్రకారం కాశ్మీరీ అమ్మాయి పాకిస్థాన్ జాతీయుడిని పెళ్ళి చేసుకుంటే అతనికి భారత పౌరసత్వం వస్తుంది.  కానీ భారతీయుడిని పెళ్ళి చేసుకుంటే ఆస్తి హక్కుతో సహా ఉన్న హక్కులన్నీ పోతాయి.  మరో విచిత్ర నిబంధన ఏమిటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండీ వలస వచ్చిన మైనార్టీల కు ఓటు హక్కు ఉండదు, కానీ ముస్లింలకు మాత్రం ఓటు హక్కు ఉంటుంది. ఇటువంటి విచిత్ర మైన నిబంధనలున్న ఆర్టికల్ 370ని షేక్ అబ్దుల్లా ఒత్తిడి మేరకు కాంగ్రెస్ విధానమైన ముస్లిం సంతుష్టికరణ లో భాగంగానే తీసుకువచ్చారని చెప్పవచ్చు. ఆర్టికల్ 370, 35A లాంటివి కాశ్మీర్ ను భారత్ కు మరింత దూరం చేశాయే గాని ఎప్పటికీ భారత్ లో భాగంగా మార్చలేకపోయాయి.

అందుకే ఈ నిర్ణయాన్ని దేశ ప్రజలంతా ఆనందంతో స్వాగతించారు. చివరిగా ఒక్క మాట “కాలం తనతో వచ్చె వారిని తీసుకు పోతుంది, రాని వారిని ఈడ్చుకు పోతుంది”. గుడ్డి వ్యతిరేకులు బీ కేర్ ఫుల్.

రచన : గజ్జెల మోహన్