
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అరెస్టు వ్యవహారం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హైడ్రామా అనంతరం ఆయన ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారుల బృందం ఉద్రిక్త పరిస్థితుల మధ్య అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలు దఫాలుగా ఆయనను విచారించిన తర్వాత సీబీఐ కోర్టులో అధికారులు చిదంబరాన్ని హాజరు పరిచారు. అయితే, చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థ యజమాని ఇంద్రాణీ ముఖర్జీ గతేడాది ఫిబ్రవరి 17న ఇచ్చిన వాంగ్మూలమే ప్రధాన ఆధారమైంది. 2006లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలోని నార్త్‌బ్లాక్ కార్యాలయంలో కలిసినప్పుడు ఆయన తన కుమారుడు కార్తీని తమకు పరిచయం చేశాడని వెల్లడించారు. కార్తీ వ్యాపారాలకు ఐఎన్‌ఎక్స్ మీడియా ద్వారా సాయం చేయాలని తనను, తన భర్త పీటర్ ముఖర్జియాను కోరారని ఆమె పేర్కొన్నారు. ఆమె ఇచ్చిన ఈ వాంగ్మూలమే చిదంబరంపై సీబీఐ, ఈడీల విచారణకు కీలక ఆధారమైంది. అలాగే, ఢిల్లీలోని ప్రముఖ హోటల్‌లో కార్తీ తమను క్విడ్ ప్రోకో కింద 1మిలియన్ డాలర్ల లంచం డిమాండ్ చేశాడని ఆమె తన వాంగ్మూలంలో తెలిపారు.
మరోవైపు, కార్తీ చిదంబరానికి చెందిన అడ్వంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్‌సీపీఎల్) కంపెనీతో కలిసి పనిచేసిన సందర్భంలోనే రూ.305 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌బీఐ) అందుకోవడానికి ‘ఐఎన్‌ఎక్స్ మీడియా’కు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) పచ్చజెండా ఊపింది. ఈ వ్యవహారంలో నగదు అందుకున్న కంపెనీలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చిదంబరం కుమారుడు కార్తి నియంత్రణలో ఉన్నాయన్నది సీబీఐ, ఈడీల ఆరోపణ. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మాత్రమే ఈ ఆమోదం తెలపాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్‌ఐపీబీ ద్వారా సమ్మతి వచ్చేలా చిదంబరం చక్రం తిప్పారనేది ప్రధాన అభియోగం. ఈ కేసులోనే చిదంబరాన్ని అనేకసార్లు దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. రూ.3500 కోట్ల ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందం కేసులోనూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఐఎన్‌ఎక్స్ కేసు వ్యవహారంలోనే కార్తీ చిదంబరం కూడా గతేడాది ఫిబ్రవరిలో అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా ఇదే కేసులో ఇంద్రాణీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసింది.
పాపం పండింది:
తన, తన సన్నిహితుల వ్యాపార సంస్థలకు లాభం చేకూర్చడానికి అనేక వ్యాపార సంస్థల, యాజమాన్యాల ప్రయోజనాలకు విరుద్ధంగా చిదంబరం నిర్ణయాలు తీసుకున్నారని, దానివల్ల పలు వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయాయని ఉన్నత వ్యాపార వర్గాలలో ఉన్న అభిప్రాయం. సాధారణ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు కూడా చిదంబరం నిర్ణయాలతో నష్టపోయినవారే. అధికారంలో ఉన్నప్పుడు తామందరినీ నష్టపరచిన పాపం నేడు పండిందని నాటి చిదంబరం నిర్ణయాలు, ప్రకటనల వల్ల నష్టపోయిన వారు అనుకుంటున్నారట.
అంతే కాకుండా సాధ్వి ప్రజ్ఞా సింగ్, కల్నల్ పురోహిత్, ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్ లతో సహా ఇలా తమకు ఎదురొచ్చిన ప్రతి వారినీ వెంటాడి వేధించిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడంటున్నారు కొందరు. వైయ్యస్సార్సీపీ అభిమానులైతే సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.
నాలుగు రోజులు కష్టడీకి :
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ ప్రత్యేక కోర్టు కస్టడీకి అనుమతించింది. కేసు విచారణలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ చేసిన విజ్ఞప్తికి న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. ఈనెల 26 వరకు నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నాలుగు రోజుల్లో కుటుంబసభ్యులు, న్యాయవాదులు చిదంబరంను కలవొచ్చని కోర్టు స్పష్టం చేసింది.