News

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో 78.25శాతం పోలింగ్‌

465views

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.సోమవారం రాత్రి 12 గంటల వరకు దాదాపు 78.25శాతం పోలింగ్‌ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

పోలింగ్ లో భాగంగా రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల్లో అత్యధికంగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో 83.19 శాతం పోలింగ్ నమోదు అవ్వగా, అత్యల్పంగా విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో 68 శాతం పోలింగ్ నమోదైందని తెలిపింది. అలాగే 175 శాసనసభ స్థానాల్లో శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 88.61 శాతం పోలింగ్ నమోదైందని, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో 55 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొంది.

రాష్ట్రంలోని కొన్ని చోట్ల రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడించారు.1.2శాతం పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి మొత్తం 79.4శాతం ఓటింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.