News

బీహార్‌లో దారుణం.. పూజారి సోను సింగ్‌ను కాల్చి చంపిన దుండగులు

0views

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోను సింగ్ అనే పూజారిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ముందుగా ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు రప్పించిన నిందితులు, మార్గమధ్యలో అతడిని అడ్డుకుని సమీపం నుంచి మూడుసార్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తల, నడుము, కాలికి బుల్లెట్లు తగలడంతో సోను సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

సోను సింగ్ రామ్‌టోలాకు చెందిన కమల్ సింగ్ కుమారుడు. సమస్తిపూర్‌లోని కెరాయ్ గ్రామంలో ఉన్న ‘ఠాకూర్ బారి’ ఆలయ సముదాయంలో ఆయన పూజారిగా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి కమల్ సింగ్ అదే ఆలయంలో మహంత్‌గా వ్యవహరిస్తున్నారు.

ఫోన్ చేసి పిలిపించి.. దారుణ హత్య
స్థానికుడు వినోద్ కుమార్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 5వ తేదీ రాత్రి సోను సింగ్ ఇంట్లో ఉన్న సమయంలో ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చిన సోను సింగ్ రామ్‌టోలా వైపు వెళ్లాడు. అక్కడ కొందరితో మాట్లాడిన తర్వాత హైవే నుంచి గ్రామానికి వెళ్లే రహదారిపైకి వస్తుండగా దుండగులు అతడిని అడ్డుకున్నారు. ఆ వెంటనే సమీపం నుంచి మూడుసార్లు కాల్పులు జరిపి హత్య చేశారు.

కాల్పుల శబ్దం విన్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే సోను సింగ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. స్థానికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

పూజారి హత్యతో ఆగ్రహించిన గ్రామస్తులు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైవేపై నిరసనకు దిగారు. సుమారు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.