
( మే 10 -1857 తిరుగుబాటు )
ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగిన ప్రధాన సంఘటనలలో 1857 తిరుగుబాటు ఒకటి. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతీయ సైనికులు తిరుగుబాటు చేయడం వల్ల దీనికి సిపాయిల తిరుగుబాటు అని పేరు వచ్చింది. అయితే నిజానికి ఇది బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతీయులంతా చేసిన పోరాటాన్ని అణచివేశారని ప్రచారం ఉన్నా..బ్రిటీష్‌వాళ్లు మన దేశాన్ని వదిలిపోయేంత వరకు ఈ పోరు సాగుతూనే వచ్చింది.
మన స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించి వీర సావర్కర్ ఒక మాట అన్నారు. పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనే శక్తిసామర్థ్యాలు కొంతమందికి ఉండకపోవచ్చు..అయినా వారు, తమ మాతృభూమి బానిస సంకెళ్లను విముక్తి కలిగించమని ప్రార్థించి ఉంటారు. ఆ విధంగా వారు కూడా సంగ్రామంలో పాలుపంచుకున్నారనే చెప్పాలి. వారికీ ఈ పోరాటంలో స్థానం ఉందని వీర సావర్కర్ అన్నారు.
భారతీయులు చేపట్టిన మొదటి స్వతంత్ర పోరాటాన్ని సూత్రీకరిస్తూ సావర్కర్ ‘‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’’ అనే గ్రంథాన్ని రాయగా దాన్ని బ్రిటిష్ వారు నిషేధించారు. విప్లవకారుల గ్రంథంగా పేరు తెచ్చుకున్న ఈ రచన స్వాతంత్ర్యం కోసం ప్రజల హృదయాల్లో విప్లవ జ్వాలను రగిలించింది.
1857 తిరుగుబాటుకు రాజకీయ, సాంఘిక, మత, ఆర్థిక, సైనిక ఇలా పలు కారణాలు ఉన్నాయి. డల్హౌసీ విధానాలు, సనాతన ధర్మం పై దాడి, నిర్బంధ క్రైస్తవ మత బోధన, స్వదేశీ రాజ్యాల ఆక్రమణ, ఆంగ్ల సైనికులతో పోల్చితే భారత సిపాయిల జీత భత్యాల్లో భారీ వ్యత్యాసం ఇలా పలు కారణాలు అంతకు మించి తమ మాతృభూమిని పరాయాధీనం నుంచి విముక్తి కలిగించాలనే భావన వెరసి మొదటి స్వాతంత్ర్య సంగ్రామానికి పురిగొల్పింది.





