ArticlesNews

అప్పన్న చందనసేవకు వేళాయె!

329views

చందనోత్సవం ప్రత్యేకం 

దుష్టసంహారానికి ఉగ్రరూపధారియైన నృసింహుడు భక్తుల అభీష్టం నెరవేర్చేందుకు అనేక చోట్ల స్వయంభువుగా వెలిశాడు. అలాంటి ప్రసిద్ధ క్షేత్రాలలో సింహగిరి ఒకటి.  విశాఖ  తూర్పు కనుమలలో ప్రకృతి సౌందర్యం నడుమ సింహాద్రిపై పశ్చిమాభిముఖుడైన శ్రీలక్ష్మీవరహా నృసింహుడు అశేష భక్తకోటికి ఇష్టదైవం. చైత్ర శుద్ధ ఏకాదశి నాడు కల్యాణం జరిపించుకునే నారసింహుడు వైశాఖ శుద్ధ తదియ నాడు భక్తజనకోటికి నిజరూప దర్శనం అనుగ్రహిస్తాడు. చందనోత్సవం నాడు నిజరూపం దర్శనం వైకుంఠంలో లక్ష్మీనారాయణులను దర్శించినంత ఫలితమని క్షేత్ర మహాత్మ్యం పేర్కొంటోంది.

‘గంగధార సమం తీర్థం క్షేత్రం సింహాద్రి నాసమం
నారసింహ నమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయః’
(సింహాద్రీశుడి సేవకోసం ఉద్భవించిన గంగధార లాంటి తీర్థం లేదు. నృసింహునికి సాటిదైవం త్రిలోకాలలోనూ లేడు. సింహాచలం లాంటి క్షేత్రం లేదని క్షేత్ర మహాత్య్మం.)

చందనయాత్ర..
స్వామి నిజరూప దర్శనం రోజు ‘చందనయాత్ర, చందనోత్సవం’గా ప్రసిద్ధి. అక్షయ తృతీయ ముందు నాడు బంగారు గొడ్డలి సహాయంతో స్వామి వారిపై గల చందనాన్ని తొలగిస్తారు. మరునాడు వేకువజామున సుప్రభాత సేవ అనంతరం ఆలయ సమీపంలోని ‘గంగధార’తో సహస్ర కలశాభిషేకం నిర్వహించి నిజరూప దర్శనానికి అవకాశం కల్పిస్తారు. దర్శనానంతరం మళ్లీ అభిషేకం నిర్వహించి 120కిలోల పచ్చి చందనంతో అరవై రకాల వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు కలిపి స్వామికి లేపనం సమర్పిస్తారు. ఇలా మరో మూడు విడతలు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి నాడు మొత్తం 480 కిలోల చందనాన్ని సమర్పిస్తారు. శ్రావణ పూర్ణిమ నాడు మేలిముసుగు కరాళ చందన సమర్పణతో ఈ పక్రియ ముగుస్తుంది.

సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే
సింహచల నివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్‌!!