ArticlesNews

పర్యటన.. పారమార్థికత

2.7kviews

స్వామి వివేకానంద జీవనప్రస్థానంలో పర్యటనల ఘట్టం స్ఫూర్తిమంతమైంది. భారతావని ఔన్నత్యంపై అవగాహనకు ఆసేతు హిమాచలం అకుంఠిత దీక్షతో సంచరించి స్వామీజీ మహోన్నత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం పశ్చిమదేశాల్లో పర్యటించి ఆధ్యాత్మిక ఝంఝామారుతంలా పరిణమించటం జగమెరిగిన సత్యం.

పర్యటిస్తే పరిణతి..
యస్తు సంచరతే దేశాన్‌ యస్తు సేవేత పండితాన్‌
తస్య విస్తారితా బుద్ధిః తైల బిందు రివాంభసి
ఎక్కువ ప్రదేశాలు సంచరించి, పండితులను సేవించేవారి బుద్ధి నీళ్లలో పడిన నూనెచుక్కలా విస్తరిస్తుంది- అంటుంది మన సనాతన ధర్మం.

విహరించటం జీవనశైలిలో భాగమైతే, జ్ఞానమూ ఆర్జించవచ్చు- అనటానికి ఆ రంగంలో విశేషకృషి చేసిన సాహితీ మూర్తులే సాక్ష్యం. పర్యటనలు చేసి ఏనుగుల వీరాస్వామి ‘కాశీయాత్ర చరిత్ర’, తిరుమల రామచంద్ర ‘హంపీ నుంచి హరప్పా దాక’ యాత్రా గ్రంథాలు వెలువరించారు.

సుందర స్థలాలను దర్శించి ఆనందించటం నేర్చుకుంటే ప్రాపంచిక సమస్యల బరువులు చాలా తేలికవుతాయి. కేవలం భౌతిక ప్రయోజనాలకే విలువనిస్తూ, సుందర అనుభూతులకు దూరమైతే.. నిరాశతో, ఆందోళనతో కుంగిపోయే అవకాశముంది. విశ్వకవి రవీంద్రుడు తన పర్యటన అనుభూతిని తలచుకుంటూ ‘చిన్నప్పుడు ఒకసారి నాన్నతో గంగానదిపై గూటి పడవలో ప్రయాణించటం మరపురాని జ్ఞాపకం తొలిసారి నాన్నతో హిమాలయాల దర్శనం కూడా గొప్ప అనుభూతి. యాత్రలు, పర్యటనల్ని ఎలా మధురస్మృతులుగా మలచుకోవాలో అప్పుడే తెలుసుకున్నాను’ అన్నారు. ఇంగ్లండ్‌కి చెందిన పాల్‌ బ్రంటన్‌ ఆధ్యాత్మిక యాత్రికుడు. పాత్రికేయ వృత్తిని వదిలేసి ప్రాచ్య, పాశ్చాత్య దేశాలు పర్యటించారు. భారత్‌లో ఎందరో యోగులు, సన్యాసులను కలిసి.. నిగూఢ ఆధ్యాత్మిక సత్యాలను ఆకళింపు చేసుకున్నారు. అరుణాచలంలో రమణమహర్షి సన్నిధిలో తన సత్యాన్వేషణకు ముగింపు పలికారు.