ArticlesNews

మలిసంధ్యలో మాధవ ధ్యానం

64views

యౌవనం తొలిసంధ్య అనుకుంటే.. వార్ధక్యం మలిసంధ్య లాంటిది. ఆ మునిమాపు దశ నుంచి అనాయాసంగా నిష్క్రమించటానికి భగవంతుడి చరణాలే శరణ్యం. ఆధ్యాత్మిక చింతనే అత్యున్నత మార్గం. విషయానందం నుంచి బ్రహ్మానంద స్థితికి ఎంత త్వరగా చేరుకుంటే జీవిత చరమాంకంలో అంత ప్రశాంతతను ఆస్వాదించగలం. అంత్యకాలంలో అంత ఆనందాన్ని అనుభవించగలం.

మనసు మాధవుడిపై నిలవాలంటే..
వృద్ధాప్యంలో ఓ భక్తుడు రమణ మహర్షి వద్దకు వచ్చాడు. ‘భగవాన్‌! ఇంత వయసొచ్చినా.. మనసు భగవంతుడి దిశగా ఎందుకు మరలటం లేదు?!’ అని ఆవేదన చెందాడు. అప్పుడు మహర్షి ‘మనిషికి సంపదే ఎక్కువ ప్రియం. ఆ సంపద కన్నా సంతానం, అంత కన్నా తన శరీరం, ఆ దేహం కన్నా ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల్లోకెల్లా నయనం.. కన్ను కన్నా ప్రాణం మీద ప్రీతి. ప్రాణం ప్రియం కనుక. ఇలా ఉంటుంది మనిషి అపేక్ష, స్వార్థం. అలాంటి మమకారాలన్నీ తగ్గించుకుంటే.. అప్పుడు మనసు భగవంతుడిపై నిలుస్తుంది’ అన్నారు.

పరమాత్మ ధ్యానం.. పరోపకారం.
పరమాత్మ ధ్యానం, పరోపకారం ప్రశాంతమైన వార్ధక్యానికి మూల సూత్రాలు. ఈ దేహంలో దారుఢ్యం ఉన్నప్పుడే సత్కార్యాలు చేస్తూ, ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించుకుంటూ గడపాలి. బ్రహ్మ ఈ శరీరాన్ని రాళ్లతో మలచలేదు. అయినా.. మనుషులు సత్యం, దానం, దయ, ధర్మం.. అన్నీ వదలివేస్తున్నారు’ అంటూ చెప్పి ఆవేదన చెందాడు బలిచక్రవర్తి. యౌవనం కన్నా వార్ధక్యానికి ఉన్న ప్రత్యేకత అనుభవసారం. అపారమైన జీవితానుభవాలతో పాఠాలు నేర్చుకుని, వివేక వైరాగ్యాలు పెంచుకుని రాబోయే తరాలకు మార్గదర్శకులుగా నిలవాల్సింది పెద్దవారే! ఈ అంత్యదశ చింతనను ఈశోపనిషత్తు అద్భుతంగా వర్ణించింది.

సూర్యుడు అస్తమిస్తున్న కాలాన్ని సంధ్యారాగం అంటారు. మనం అస్తమించే గడియలు కూడా ఆంతరంగిక ప్రశాంతతతో, ఆధ్యాత్మిక అన్వేషణతో సంధ్యారాగంలా రవళించాలి. నిశ్చలమైన మన చరమకాలం నలుగురికి ఆదర్శంగా నిలవాలి.