ArticlesNews

ఆధ్యాత్మిక పథంలో అజరామర సేవలు

257views

( మే 1 – రామకృష్ణ మిషన్‌ ఆవిర్భావ దినోత్సవం )

స్వామి వివేకానంద అమెరికాలో ఓ సత్సంగంలో.. ఎమిలి అనే యువతితో ‘నేనిక్కడ సమ్మోహితుణ్ణి అయిపోయాను’ అన్నారు. ‘మిమ్మల్నలా చేసిన స్త్రీ ఎవరు?’ అందామె సరదాగా. స్వామీజీ నవ్వి ‘నన్ను ఆకర్షించింది యువతి కాదు, ఈ దేశ ప్రజల సంఘటిత కార్యాచరణ శక్తి’ అన్నారు. ప్రాపంచిక విజయాలకే కాదు, పారమార్థిక పురోగతిలోనూ సంఘ ప్రాధాన్యతను గుర్తించారు. ఆ స్ఫూర్తితోనే దేశానికి తిరిగొచ్చాక గురుదేవుల పేరు మీద రామకృష్ణ సంఘానికి శ్రీకారం చుట్టారు. సమాజంలో ఉంటూనే నిష్కామ సేవాకార్యక్రమాలతో సుసాధ్యం చేసుకోవచ్చని నిరూపించారు. ఆధ్యాత్మిక సాధనకు సరికొత్త నిర్వచనాన్నిచ్చారు.

జీవసేవే శివసేవ
ఇది పరమహంస మాట. ఆ ప్రేరణతో స్వామి వివేకానంద 1897 మే 1న రామకృష్ణ మిషన్‌ను ప్రారంభించారు. గురుదేవుల సతీమణి శారదాదేవి ఆశీస్సులు, మార్గదర్శకత్వంతో విధివిధానాలను రూపొందించారు. ‘కాషాయ వస్త్రధారణ త్యాగానికి ప్రతీక. త్యాగమంటే సమాజానికి దూరంగా వెళ్లడం కాదు. పరుల సుఖం కోసం స్వీయసుఖాన్ని త్యజించటమే నిజమైన త్యాగం’ అంటూ కొత్త సన్యాస సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. సేవతో కూడిన సాధన, భగవంతుణ్ణి గుర్తించటంలో తోడ్పడుతుందని ఆచరణాత్మకంగా చూపారు. వివేకానంద అడుగు జాడల్లో పయనిస్తూ కాలాంతరంలో సంఘ సాధువులు, భక్తులు.. దేశ, విదేశాల్లో మిషన్‌ కేంద్రాలను స్థాపిస్తున్నారు. విద్య, వైద్య, సహాయక సేవాకార్యక్రమాలను చేపడుతున్నారు.ఈ ప్రభావంతో ఇతర ఆధ్యాత్మిక సంస్థలు కూడా సామాజిక, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాయి. అలా మన ధర్మ ప్రవాహానికి కొత్త ఒరవడిని సృష్టించిన స్వామి వివేకానంద నవీన యుగానికి స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. రామకృష్ణ మఠం సాధువుల, జిజ్ఞాసువుల తపోమయ జీవితానికి కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది.