
విద్య అన్నది ప్రపంచాన్ని తెలుసుకునే మార్గం అని తేల్చి చెబుతూ ఈ చదువుల్ని లోక కళ్యాణం కోసం ఉపయోగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ సూచించారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో సీబీఎస్ఈ పాఠశాలగా రూపుదిద్దుకున్న నాదర్ గుల్ లోని విద్యాభారతి విజ్ఞాన కేంద్రం భవనాలను ఆదివారం పరమహంస పరివ్రాజకారాచర్య త్రిదండి చిన శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 1952 లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఒక చిన్న గదిలో ప్రారంభమై ఇప్పుడు దేశ వ్యాప్తంగా వేలాది పాఠశాలలు నడుస్తున్నాయని డా. భగవత్ వివరించారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజానికి సేవలు అందిస్తోందని చెప్పారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభించినప్పటికీ దేశ భక్తి, విలువలతో కూడిన విద్యకు పెద్దపీట వేయటం జరుగుతోందని స్పష్టం చేశారు.
విదేశాలకు విహార యాత్రకు వెళ్లే ముందు, అయోధ్య వంటి పుణ్య స్థలాలను సందర్శిస్తే దేశ భక్తి మరింత పెరుగుతుందని ఆయన సూచించారు. స్వయంసేవక్ లు చివరి శ్వాస దాకా సమాజం కోసమే పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు. మనమంతా రాముని బాటలో నడవాలని ఆయన పిలుపు ఇచ్చారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. కుత్రిమ మేధస్సు వంటి సౌకర్యాలను సమాజహితం కోసం వాడుకోవాలని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సంఘ్ మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.





