ArticlesNews

పార్లమెంట్ లో ఋజువైన కాంగ్రెస్ యొక్క పాక్ అనుకూల వాదం – కాశ్మీర్ రక్షణ కోసం మా ప్రాణాలైనా అర్పిస్తామన్న అమిత్ షా

89views

కాంగ్రెస్ వితండ వాదం :

కాంగ్రెస్ కు చెంప పెట్టు అనదగ్గ సంఘటన లోక్ సభలో చోటు చేసుకుంది. “ కాశ్మీర్ సమస్య అంతర్గత సమస్య ఎలా అవుతుంది?” అని ప్రశ్నించడం ద్వారా కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం దశాబ్దాలుగా అనుసరిస్తున్న వైఖరినే కాంగ్రెస్ ప్రశ్నించినట్లైంది. “ ఈ సమస్యను ఐక్యరాజ్య సమితి 1948 నుంచి పరిశీలిస్తోంది”. అని చెప్పడం ద్వారా కాంగ్రెస్ లోక్ సభలో సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లైంది. కాంగ్రెస్ సభ్యుడు ఆదిర్ రంజన్ చౌదరి పార్లమెంట్ లో 370 ఆర్టికల్ రద్దుపై జరిగిన చర్చలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

లోక్ సభలో 370 ఆర్టికల్ రద్దుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ “ మీరు ఇది అంతర్గత సమస్య అంటున్నారు. కానీ 1948 నుంచి ఐక్యరాజ్య సమితి దీనిని పరిశీలిస్తూండగా ఇది అంతర్గత సమస్య అవుతుందా? మేము షిమ్లా ఒప్పందం మీద, లాహోర్ డిక్లరేషన్ మీద సంతకం చేశాం. అది అంతర్గతమైనదా? ఉమ్మడిదా?”  అని ప్రశ్నించారు. అంతటితో ఆగక “కొన్ని రోజుల క్రితం విదేశాంగ శాఖా మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా కార్యదర్శితో మాట్లాడుతూ కాశ్మీర్ మా ఇద్దరి సమస్య, ఇందులో మీరు కల్పించుకోవద్దు అన్నారు. మరి ఇంకా కూడా జమ్మూ కాశ్మీర్ సమస్య అంతర్గత సమస్య అవుతుందా? మేము తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీ నుండి జ్ఞానోదయం పొందాలనుకుంటోంది.” అన్నారు. చౌదరి తన వాదనను కొనసాగిస్తూ “ కేంద్ర ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ఆలోచించటం లేదు” అని ఆరోపించారు.

అమిత్ షా ఆగ్రహం :

వెంటనే అమిత్ షా తీవ్రంగా ప్రతిస్పందిస్తూ “జమ్మూ కాశ్మీర్ గురించి నేను ప్రతి సారీ ప్రస్తావిస్తున్నది పాక్ ఆక్రమిత కాశ్మీర్, చైనా ఆక్రమిత అక్సాయ్ చిన్ లతో కూడిన మొత్తం కాశ్మీర్ గురించి. కాశ్మీర్ కోసం మేం ప్రాణాలర్పించటానికైనా సిద్ధమే.” అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ వాదం – పాక్ కు లాభం :

ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ నేత కాశ్మీర్ పట్ల భారత్ దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న వైఖరినే ప్రశ్నించినట్లైంది. 1949 నుండి 1972లో షిమ్లా ఒప్పందం జరిగే వరకు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం  జమ్మూ  కాశ్మీర్ సరిహద్దుల్లో భారత్ పాక్ ల మధ్యనున్న కాల్పుల విరమణ అమలును పరిశీలిస్తూ ఉండేది. ఐతే మనదేశం షిమ్లా ఒప్పందం తర్వాత కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాల ప్రమేయాన్ని తిరస్కరించింది. కానీ పాకిస్థాన్ మాత్రం  ఎప్పుడూ మూడవ శక్తి ప్రమేయాన్ని కోరుతూ వస్తోంది.

ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార పక్షంపై ఇలాంటి ప్రశ్నలు సంధించటం ద్వారా భారత్ షిమ్లా, లాహోర్ ఒప్పందాల ఉల్లంఘనకు పాల్పడుతోందన్న నెపంతో ఐక్యరాజ్యసమితి ప్రమేయాన్ని కోరమంటూ పాకిస్థాన్ కు సూచన చేసినట్లైంది. కాంగ్రెస్ యొక్క పాక్ అనుకూల వైఖరి దీని ద్వారా స్పష్టంగా వ్యక్తమౌతోంది.