ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న విదేశి వనితలు 67 ; అనీబిసెంట్

50views

భారతదేశ స్వాతంత్రం కోసం స్వదేశీయులు ఉద్యమం చేయటం అర్థం చేసుకోగలం. భారతీయుల స్వాతంత్ర కాంక్షను గుర్తించి భారతీయులతో గళం కలిపిన విదేశీ వ్యక్తులు వున్నారు. ఐరోపా దేశాలు వలసపాలన సాగిస్తున్న సమయంలో ఆ ఐరోపా ఖండ దేశీయులే బ్రిటీష్ వారి దమన నీతిని ఖండిస్తూ, వారి దోపిడి సంస్కృతిని నిరసిస్తూ భారతీయులతో గొంతుకలిపారు. అటువంటి వారిలో ఆంధ్రప్రాంతం కేంద్రంగా చేసుకుని స్వాతంత్ర ఉద్యమాలలో మమేకమైన ముగ్గురు మహిళలు వున్నారు. వారే అనీబిసెంట్, మార్గరెట్ కజిన్స్, మెల్లీ షోలింగర్.వారిలో ప్రముఖులు అనీబిసెంట్

పరాయి ప్రభుత్వంవారు తామేలుతున్న దేశ సౌభాగ్యానికి పాటుబడటం అరుదుగా ఉంటుంది. ఇక పరదేశీయులు, మరొక దేశంవచ్చి, దానిని మాతృభూమిగా మనసారా భావించి ప్రజలతో మమేకమైనవారు చాలా తక్కువమంది ఉంటారు. ఒక సిస్టర్ నివేదిత, అరవిందాశ్రమంలోని మదర్, ఒక అనీబిసెంట్ వంటివారు లెక్కించదగినవారు. అధికార అహంకారంపట్ల తిరుగుబాటుచేసే మనస్తత్వంగల అనీబిసెంట్ కూతుర్ని, కొడుకును కన్న తరువాత భర్తను విడిచి మనదేశం వచ్చింది.

అనీబిసెంట్ 1847 అక్టోబర్ 1న జన్మించి, 1893లో మనదేశంలో అడుగుపెట్టింది. 46వ ఏట 1889లో దివ్యజ్ఞాన సమాజంలో అడుగుపెట్టింది. ఆ సంస్థ ఒక జ్ఞానప్రదాయిని. పూర్వవైభవంపట్ల భక్తివిశ్వాసాలు ప్రకటించి ప్రజలలో ఒక చైతన్యాన్ని తీసికొనివచ్చిన సంస్థ అది. పాశ్చాత్య విధానాలపట్ల మోజులోనున్న ప్రజలకు గత వైభవాన్ని గుర్తుచేసి పాశ్చాత్యులను గ్రుడ్డిగా అనుకరించవద్దని ఆమె హెచ్చరించింది.

భారతదేశం అతీంద్రియశక్తులకు ఆలవాలమని, అపార వాఙ్మయసంపద ఉందని, ఈ నాగరికత, సంస్కృతి ఘనమైనవని మరిచిపోయే మనలకు గుర్తుచేసిన సంస్థలో పనిచేసింది. ప్రాచీన వాఙ్మయంలోని ఆణిముత్యాలను వెలికిదీసి వాటి విలువను లెక్కగట్టలేమని మనకంటే ఎక్కువగా వాదించింది. ఈమె పాండిత్యాన్ని, వాక్రవాహాన్ని చూసి మహామహోపాధ్యాయ, పండిత గంగాధర శాస్త్రిగారు “సర్వ శుక్లా సరస్వతీ” అనేవారు. ఆమె సహజంగా తెల్లగా ఉండేది. స్వచ్ఛమైన తెల్లనైన సరస్వతి అని కొనియాడారు.

ఈమె ప్రసంగాలు, గత వైభవం ఏమీలేదని అనుకొనేవారిని ఒక్కమాటు ఆలోచింప చేసాయి. కేంద్ర హిందూ కళాశాలను ఈమె స్థాపించగా, మాలవ్యాగారి చేతిలో అది ‘హిందూ విశ్వవిద్యాలయం’గా రూపొందింది. అది వటవృక్షమైంది. అసలే పరమ పవిత్రమైన కాశిలో. అందు గంగా సదృశ్యుడైన మాలవ్యా గారి కరకమలాలచే రూపుదిద్దుకొనబడింది. పాశ్చాత్య విద్యలు, ఆధునికశాస్త్ర విజ్ఞానమూ అందు బోధింపబడేవి.

అన్ని వర్ణాల బాలురు ఏకపంక్తిలో భుజించాలని, వివాహితులకు ఈ కళాశాలలో చదివే అర్హతలేదని అనడంద్వారా బాల్యవివాహాలకు అడ్డుకట్టవేసింది. రిచర్డ్సన్, అరండేల్ ఇంగ్లండు నుండి వచ్చి ఈమెకు అండగా ఉన్నారు. అర్హులైన విద్యార్థులను పైచదువులకై విదేశాలకు పంపేది.

కామన్వెల్తులో సంపూర్ణ స్వతంత్రమైన భారతదేశం ఉండాలని భావించింది. ఒక జాతీయపతాకను తయారుచేసింది. విలియం బ్లేక్ మాదిరిగా మతమే రాజకీయాలని, రాజకీయాలనగా సౌభ్రాతృత్వమని చాటింది. ఇంగ్లండులో రాజకీయ సంస్కరణలు జరగడానికి హింసనే ఆయుధంగా వాడుకొనడంవల్ల రక్తపాతం జరిగిందని అనేక ఉదాహరణలను పేర్కొంది. అట్టి రక్తపాతం ఇక్కడ లేకపోతే హోంరూల్ ఉద్యమానికి తాను శ్రీకారం చుట్టవలసిన అవసరమే ఉండేదికాదు. కదా అని వాదించింది.

1914 నుండి చురుకుగా రాజకీయాలలో పాల్గొంది. న్యూ ఇండియా అనే పత్రికను, కామన్ వీల్ అనే వారపత్రికను మద్రాసులో నడిపింది. ఈమె హోంరూల్ ఉద్యమం – తిలక్, జిన్నా, సప్రూ, మోతీలాల్, రామస్వామి అయ్యర్ వంటి కొమ్ములు తిరిగిన నాయకులను ఆకర్షించింది. 1917లో జాతీయ కాంగ్రెసు సభలకు అధ్యక్షత వహించింది. అక్కడ ఆమె పలికిన మాటలు వినండి…

“నేను అణచివేయబడినపుడు గౌరవంతో మీరు కిరీటాన్ని నా తలపై బెట్టారు.నేను అపనిందకు గురియైనపుడు నా నిజాయితీని మీరు శంకింపలేదు. అధికారదర్పం నన్ను అణగద్రొక్క యత్నించినపుడు ఈమే మా నాయకురాలని సంతోషంతో కేకలు వేసారు. నా వాదనను వినిపింపచేయడంలో అవకాశం చిక్కినపుడు నా విముక్తికై నన్ను సమర్థించి నాకు బంధవిముక్తిని ప్రసాదించారు”.

గాంధీగారి నాయకత్వం ఎప్పుడైతే వచ్చిందో, అపుడు అభిప్రాయభేదాల వల్ల కాంగ్రెసును విడిచిపెట్టింది. ఇటుకలకు గుండ్లతోనే సమాధానం చెప్పాలనే ఈమె యొక్క ధోరణిని గాంధీ సమర్థించకపోవడంవల్లనే. భారతదేశానికి, ఇక్కడ ఉన్న రాజవంశానికి చెందినవాడు వైస్రాయిగా ఉండాలని అభిలషించేది.

86 ఏండ్ల ప్రాయంలో 1933 సెప్టెంబరు 23న కన్ను మూసింది. భారతదేశం ఉన్నంత వరకు ఈమె సేవలకు జరామరణాలు లేవని గాంధీజీ అన్నారు. “Will live as long as India lives”.