ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 56 ; ఏనుగు పట్టాభిరామిరెడ్డి

489views

నెల్లూరు జిల్లా యావత్తు మరిచి పోలేని వ్యక్తి ఏనుగు పట్టాభిరామిరెడ్డి దళితుల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి సేవలు చేశారు. తన సంపాదనను, ఆస్తిని, జీవితాన్ని సంఘసేవకోసం ధార పోశారు. ఆయనను అందరూ ‘పట్టన్న’ అని ఆత్మీయంగా పిలిచేవారు. కులవివక్ష అధికంగా వున్న నాటిరోజుల్లో అగ్రవర్ణంలో పుట్టి దళితుల అభివృద్ధికోసం పోరాడి తన జీవితాన్నే అర్పించిన మహానుభావుడాయన. వృత్తిరీత్యా న్యాయవాదిగా వుంటూ తన సంపాదన, ఆస్తులతో దళిత విద్యార్ధులను చదివించి వారి జీవితాలకు వెలుగు చూపించారు. ఎంతోమంది. ఐ.ఎ.ఎస్. ఐ.పి.ఎస్ అధికార్లను, సూపరింటెండెంట్ ఇంజనీర్లతో పాటు, ఎంతోమంది మేధావుల్ని తన స్వయంశక్తితో దేశానికి అందించారు. నెల్లూరులో 1943 నుంచి 1972 వరకు తన స్వయంశక్తితో హరిజన బాలుర హాస్టలు నడిపి వేల సంఖ్యలో దళిత విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దారు. జూన్ 17, 1903లో బుచ్చిరెడ్డిపాళెంలో రావమ్మ, పిచ్చిరెడ్డి దంపతులకు జన్మించిన పట్టాభిరామిరెడ్డి అప్పట్లో గాంధీజీ ఇచ్చిన దళితోద్ధరణ పిలుపుకు ప్రభావితుడై దళిత ఉద్దరణకు నడుంకట్టారు. వివాహం చేసుకోకుండా ఆయన దళితుల సేవకు అంకితమయ్యారు.

వారు బి.ఎ.,బి.ఎల్. పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టారు. సంఘ సేవకులుగా అనేక సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నిమ్నవర్గాల సేవకై అహర్నిశలూ తపిస్తూ, కో-ఆపరేటవ్ ఇన్స్పెక్టరు ఉద్యోగాన్ని సైతం వదులుకొని అంబేడ్కర్ ఉద్యమంలో గణనీయమైన సేవ చేసిన త్యాగశీలి. ఏనుగు పట్టాభిరామిరెడ్డి గారు న్యాయవాద వృత్తిని నిర్వహిస్తూ తీరిక సమయంలో సాంఘిక అసమానతలపై కరపత్రాలు, పత్రికలకు వ్యాసాలు వ్రాస్తుండేవారు.

పట్టయ్య హాస్టల్ బాధ్యతలు స్వీకరించేనాటికి 1944 సం॥లో తొమ్మిది మంది. విద్యార్థులతో, దయనీయమైన వసతులతో ఉండేది ఆ హాస్టల్. అనేకమంది దాతల సహకారంతో వసతులను, భవనాలను నిర్మించుకుంటూ వెళ్ళారు. 1972 నాటికి 2,000 మంది విద్యార్థులయ్యారు. సంఖ్యలోనూ, వసతిలోనూ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద హాస్టలు. హాస్టలు నిర్వహణ ఆర్థికంగా చిన్నవిషయం కాదు. ఎంతో మంది నుండి సహకారం పొందుతూ హాస్టల్ ను నిర్వహించారు. అప్పట్లో ఆంధ్రరాష్ట్రం నలుమూలల నుండే కాక విద్యార్థులు మద్రాసు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఆ హాస్టల్లో చేరి చదువుకునేవారు. వందల, వేల సంఖ్యలో హాస్టల్లో విద్యార్థులున్నా ప్రతి విద్యార్థి పేరు, తల్లితండ్రుల వివరాలు, వారి ఊరు, అన్ని వివరాలు వారికి గుర్తే, ప్రతి విద్యార్థి చదువు విషయమేకాదు, వారికిష్టమైన వ్యాయామ క్రీడలు, నాటకాలలో పాత్రధారణ – ఈ అభిరుచులను కూడా ప్రోత్సహిస్తూండేవారు. వారి సమర్థతలను స్వయంగా చూచి, ఎంతో ఆనందపడుతూండేవారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలను చూచి వారిని ఆయా చదువుల విషయంలో ప్రోత్సహించేవారు.

స్వయంగా కూరగాయలను కొనుగోలు చేసేవారు. పిల్లలకు స్వయంగా అన్నం వడ్డించేవారు. వారు వివాహం చేసుకోలేదు. బ్రహ్మచారిగా గడిపారు. తన జీవితమంతా హాస్టలు నిర్వహణకు, హస్టలు విద్యార్థుల వికాసానికి అంకితం చేసారు. విద్యార్థుల చదువు పూర్తయినా ఉద్యోగం వచ్చేంతవరకూ హస్టల్లోనే ఉంచి పోషించేవారు. ఉద్యోగం రావడం కొరకు ఎంతో ప్రయత్నం చేసేవారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక నెల బత్తెం ఇచ్చి, సీనియర్స్ ఎవరైనా ఆ ఊళ్ళో ఉంటే వీరి భద్రత ఆ సీనియర్సుకు అప్పజెప్పేవారు. విద్యార్థులు పెద్దవారై వివాహం చేసుకుంటే ఎంత దూరమైనా ప్రయాణించి, వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించేవారు.

నిమ్నవర్గీయులేకాక, ఇతర బాలికలు కూడా అనేక మంది హాస్టలులో ఉండి చదువుకుని, ఉద్యోగులయ్యారు. 1972 వరకూ ఈ హాస్టల్ నిర్వహింపబడింది.50 సం॥ల సుదీర్ఘ హాస్టల్ నిర్వహణలో 4,000 మందికి పైగా విద్యార్థులు చదువుకుని, ఉన్నత స్థానాలను పొందారు. వారిలో అనేక మంది IAS, IPS, న్యాయవాదులుగా డాక్టర్లుగా.. ఉన్నత స్థానాలను పొందారు. ‘పట్టయ్య’ హరిజన సేవాసంఘానికి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. హరిజన సేవా పరాయణులైన వడియారం సాయప్ప, శ్రీమతి యారక్ష బాయప్ప, బి.సి. నరసింహులు, ఇస్కా చెంచయ్య, పొట్లూరి రామమూర్తి మొ||వారిని తీసుకుని ప్రతి నెల 30వ తేదిన (హరిజన దినోత్సవమున) హరిజన దేవాలయప్రవేశము, సహపంక్తి భోజనాలు, హరిజనులకు ఇండ్ల పట్టాలు, వ్యవసాయభూముల పంపిణీ ఇలా ఎన్నో కార్యక్రమాలను చేశారు. శ్రీ పట్టయ్య గాంధేయవాది నిత్యఖద్దరుధారి. 17-1-1983న వారు తనువును చాలించారు.