
361views
తిరుమల తిరుపతి దేవస్థానం మొట్టమొదటిసారిగా ప్రచురించిన ఉగాది తెలుగు క్యాలెండర్ వచ్చే వారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానుందని టీటీడీ కార్య నిర్వాహణ అధికారి ఎవి.ధర్మారెడ్డి తెలియజేశారు. తిరుపతిలో ఆయన శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ ఏప్రిల్ 9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. క్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటికే తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎండ వేడిమి నుండి రక్షణ కోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు. శేషాచల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామనీ, యాత్రికులు నీటిని పొదుపుగా వాడాలని ధర్మారెడ్డి సూచించారు.





