
యువ శాస్త్రవేత్తల ఆలోచనలు, ప్రతిభ, ఆవిష్కరణలకు యంగ్ సైంటిస్ట్ మీట్ వేదిక అవుతుందని, వారే భావి భారతావని మార్గదర్శకులని భారత ప్రభుత్వ రక్షణ శాఖ ఆర్ అండ్ డి కార్యదర్శి, డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ అన్నారు. గురువారం విశాఖ జిల్లా గోపాలపట్నంలో నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ (ఎన్‌ఎస్‌టీఎల్) మానసి ఆడిటోరియంలో యువ శాస్త్రవేత్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ శాస్త్రవేత్తల ప్రతిభను సానబెట్టేందుకు వైఎస్‌ఎం దోహదపడుతుందన్నారు. డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ఈ మీట్‌ను 2011లో ప్రారంభించామని తెలిపారు. ఈ సమావేశంలో యువ శాస్త్రవేత్తలు పాల్గొని వారి ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను అందరితో పంచుకుంటారన్నారు. దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ సమ్మేళనంలో ఫోర్జింగ్ కనెక్షన్ టు ఇగ్నిట్ మైండ్ అనే అంశంపై మూడు రోజులు సమావేశాలు జరుగుతాయని తెలిపారు. 2047 నాటికి అధునాతన ఆయుధాల అభివృద్ధి అనివార్యమన్నారు. డీఆర్‌డీవోను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు యువ శాస్త్రవేత్తల కృషి అవసరమన్నారు.
ఎన్‌ఎస్‌టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ గొప్ప లక్ష్యాలను నెరవేర్చే బాధ్యత యువ శాస్త్రవేత్తలపై ఉందన్నారు. డైరెక్టర్ జనరల్ వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ రక్షణలో యువ శాస్త్రవేత్తలు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. వారు అంకితభావంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి డైరెక్టర్ ప్రొఫెసర్ జయరామ్ ఎన్. చెంగలూర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా యంగ్ సైంటిస్ట్ మీట్ సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో డైరెక్టర్ జనరళ్లు, యంగ్ సైంటిస్ట్ లాబొరేటరీస్ డైరెక్టర్లు, హెడ్ క్వార్టర్ కార్పొరేట్ డైరెక్టర్లు, ఎన్‌ఎస్టీఎల్ శాస్త్రవేత్తలు, అధికారులు, సివిల్ ఎంప్లాయీస్ యూనియన్, వర్క్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.





