
దేవాలయం హిందూ ధర్మ అభ్యున్నతికి దోహదపడుతుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. అల్లూరి, విజయనగరం జిల్లాల సరిహద్దు ఎగువకొండపర్తిలోని ప్రకృతి రమణీయమైన అందాల నడుమ పర్వతం శిఖరంపై వైకుంఠ గిరిపై నిర్మించిన శ్రీ అనంత వేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి, పీఠం ఉత్త రాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ బుధవారం ప్రారంభించారు. 9.5 అడుగుల అనంత వేంకటేశ్వరస్వామి విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన చేశారు.
స్వరూపానందేంద్ర మాట్లాడుతూ..గిరిజన సంస్కృతిని కాపాడాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు.ప్రకృతి వర మిచ్చిన పర్వత శిఖరాల్లో నిర్మించిన దేవాలయం హిందూ ధర్మ అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు. గిరిజన గ్రామాల్లో శారదాపీఠం విశిష్టమైన సేవలను అందిస్తోందని చెప్పారు. విశాఖ నుంచి అరకు వెళ్లే మార్గంలోని కాశీపట్నం నుంచి 36 మలుపులతో కూడిన 18 కిలోమీటర్లు ఘాట్రోడ్డు ప్రయాణం సాగించి, పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని కోరారు. అనంత వేంకటేశ్వరస్వామితో పాటుగా గోదాదేవి, పద్మావతి దేవి, ఆళ్వార్, వరాహస్వామి, సంకల్పసిద్ధి మహా గణపతి విగ్రహాలకు ఉత్తరాధికారితో కలిసి ప్రాణప్రతిష్ట చేశారు.





