ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాజిక సమరసత వీరులు – 53 ; చుండి జగన్నాథం

247views

స్వాతంత్ర్య సమర యోధులు, సోషలిస్టు నాయకులు శ్రీ చుండి జగన్నాథం 1914 ఆగష్టు 19న నెల్లూరులో జన్మించారు. వీరి తండ్రి పేరు నరసయ్య స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన దేశభక్తులు, విప్లవ భావాలు గల తీవ్రవాది, అనేక సామాజిక ఉద్యమాలలో పాల్గొన్న సంఘసేవకులు, సామ్యవాది. స్వాతంత్య్రం, సముపార్జనతోపాటు ఆర్ధిక ప్రగతి, సామ్యవాద సమాజ నిర్మాణం జరగాలని భావించి సామ్యవాద సిద్ధాంతాలను ప్రచారం చేసిన సోషలిస్టు నాయకులు వీరు. అట్టడుగున పడి ఉన్న మానవుడి అభివృద్ధిని గురించి ఆలోచించకపోతే ప్రజాస్వామ్యానికి విలువ లేదని గట్టిగా విశ్వసించి అంత్యోదయానికి అవిరళ కృషి జరిపిన పేదప్రజల పెన్నిది వీరు. విద్యార్థిదశలోనే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు.

1932లో ప్రభుత్వం వీరిని ప్రమాదకరమైన వ్యక్తిగా భావించి జైల్లో నిర్బంధించింది. తరువాత ఒక ఏడాది శిక్ష విధించి బళ్లారి జైల్లో ఉంచారు. బళ్లారి జైల్లో ఉండగానే లాహోరు కుట్ర కేసులో అరెస్టు చేసి శిక్ష విధించిన కొందరు రాజకీయ ఖైదీలైన దేశభక్తులతో వీరికి పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదల కాగానే సర్దార్ భగత్ సింగ్ స్థాపించిన హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీలో చేరి అజ్ఞాత కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నారు.

1934లో ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింప చేయటానికి ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణపై వీరిని అరెస్టు చేసి మద్రాసు కుట్ర కేసుతో సంబంధం ఉందని నేరం మోపి జైల్లో పెట్టారు. తరువాత విచారణ జరిపి ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష వరించారు, కోయంబత్తూరు, బళ్లారి జైళ్లలో ఈ శిక్షా కాలాన్ని గడిపారు. జైలు నుంచి విడుదల కాగానే 1936లో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో చేరారు. అదే ఏడాది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించారు. అజ్ఞాతవాసంలో ఉండి ఎన్నో పోరాట కార్యక్రమాలు నిర్వహించారు. 1947-48లలో హైదరాబాదు సంస్థాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. హైదరాబాదు పోలీసు చర్య జరిగిన తరువాత సంస్థానంలో సోషలిస్టు పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. సోషలిస్టు పార్టీలో చీలికలు వచ్చి రెండు పార్టీలు ఏర్పడినపుడు వీరు తటస్థ వైఖరి అవలంబించారు.

జయప్రకాష్ నారాయణ్ పాటు భూదాన ఉద్యమంలో ప్రవేశించి గ్రామ గ్రామం తిరిగి, భూస్వాముల నుంచి భూములు సేకరించి, పేదలకు పంచి పెట్టారు. వీరు రచయిత, వక్త, మేధావి, ‘స్ట్రగుల్’ పత్రికలో ఎన్నో వ్యాసాలు రాశారు. ‘చక్రం’ అనే పేరుతో ఒక పత్రిక స్థాపించి దానికి సంపాదకత్వం వహించారు. వీరు కొంతకాలం ఖాదీ కమీషన్లో పనిచేశారు. నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి నీతి నిజాయితీతో ప్రజాసేవా రంగంలో పనిచేసిన ఆంధ్ర ప్రముఖులు వీరు.