
లేపాక్షి శిల్పకళ పరిరక్షణ, దేవాలయ పునరుద్ధరణ జరిగింది. ఒకవైపు, దేశ స్వాతంత్ర పోరాటంలో పాత్ర మరోవైపు, సమర్థతతో నిర్వహించిన గొప్ప వ్యక్తి కల్లూరు సుబ్బారావు.ఆయన అనంతపురం జిల్లాలోని హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897వ సంవత్సరం మే 25వ తేదీన శ్రీ సుబ్బరావు జన్మించారు. మాధ్యమిక విద్య ఎడ్వర్డ్ కారొనేషన్ హైస్కూల్ హిందూపూర్లో జరిగింది. ఆ తరువాత మదనపల్లెలో పన్నెండవ తరగతి వరకూ చదువు సాగింది. పదునాల్గవ ఏట అనిబిసెంట్ ప్రసంగాలు వినే అవకాశం రావడం, మహాత్మాగాంధీ దర్శనం లభించింది. మెట్రిక్యులేషన్ కూడా పూర్తిచేయక మానేసి, విద్వాన్ పరీక్షలో ఉత్తీర్ణులై పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేశారు. అయితే అనతి కాలంలోనే ఆ ఉద్యోగాన్ని కూడా మానేసి ప్రజా సేవా రంగంపైనే తన దృష్టిని మరలించారు.
కల్లూరు సుబ్బరావు స్వచ్ఛంద సేవకుడిగా విజయవాడ కాంగ్రెస్ కార్యవర్గ మహాసభకు హాజరై మహానాయకులెందరినో దగ్గరగా దర్శించుకొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనవలసిన సమయం ఆసన్నమైందని ఆయన గ్రహించారు. వెంటనే సహాయ నిరాకరణోద్యమంలోకి అడుగుపెట్టడం, ఎంతో సాహసంతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించడం, హిందూపూర్ లో అరెస్ట్ కావడం జరిగిపోయాయి. అప్పటికి ఆయనకు కేవలం ఇరవైనాలుగేళ్ల వయసు మాత్రమే. బ్రిటిష్ ప్రభుత్వం కల్లూరు సుబ్బరావుకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. 10-12-1921 నుండి 9-12-1922 వరకూ, తిరుచిరాపల్లి, కడలూరు జైళ్లలో శిక్షననుభవించారు. జైలు నుండి విడుదలయ్యాక మరింత ఉత్సాహంగా స్వరాజ్య ఉద్యమంలోనూ, ఆంధ్రోద్యమంలోనూ పాల్గొన్నారు. 1920లో మహానందిలో జరిగిన ఆంధ్రమహాసభలో యువకుడైన కల్లూరు సుబ్బరావు ఉపన్యాసానికి నాయకులు, ప్రజలు జేజేలు పలికారు.
మహాత్మాగాంధీజీ ప్రతిపాదించిన శాసనోల్లంఘన ఉద్యమంలో భాగమైన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఆయన మరోమారు అరెస్ట్ చేయబడ్డారు. 1932వసంవత్సరం జనవరి 11వ తేదీ నుండి ఒక సంవత్సరం పాటు బళ్లారి జైల్లోనూ, కోయంబత్తూర్ జైల్లోను కఠిన జైలుశిక్షను అనుభవించారు. జైలుశిక్షలు ఆయనలోని ధైర్యాన్ని మరింతగా పెంచాయి. ఆయనలోని దేశసేవానురక్తిని మరింతగా వికసింపజేశాయి. జైలు నుండి విడుదలయ్యాక మరింతగా దేశసేవా కార్యక్రమాలను, నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టారాయన. తాను స్వయంగా ఖద్దరు ధరిస్తూ ఖద్దరువ్యాప్తికి అవిశ్రాంతంగా శ్రమించారు.
1940వ సంవత్సరంలో గాంధీజీ వ్యక్తి సత్యాగ్రహాన్ని ఆరంభించగా ఆయన వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. ఈసారి ఆయనకు మరొక ఏడాది జైలుశిక్ష విధించబడింది. జైలునుండి విడుదలై రాగానే తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈసారి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి, మూడేళ్ల జైలుశిక్ష విధించింది. 1942 నుండి 1944వ సంవత్సరం వరకూ, వెల్లూరు జైల్లో నాగపూర్ జైల్లో, అమరావతి జైల్లో కఠిన కారాగార శిక్షలు అనుభవించారు. ఈ విధంగా స్వాతంత్ర్య పోరాటంలో కల్లూరు సుబ్బారావు దాదాపుగా ఏడేళ్ల పాటు జైలు శిక్షలు అనుభవించి, దేశసేవలో చరితార్థుడయ్యారు.
జైలుశిక్షలు అనుభవిస్తున్నప్పుడు తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, కన్నడ భాషల్లో స్వయంకృషితో, మంచి పాండిత్యాన్ని సంపాదించారు. ఆయన గొప్ప వక్త కూడా. అందుకే, డా॥చక్రవర్తుల రాజగోపాలాచారి, కల్లూరు సుబ్బారావును జైలు పట్టభద్రుడు (PRISON GRADUATE) అంటూ చమత్కరించారు.
1937లో మద్రాసు శాసనసభకు పెనుగొండ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. రాయలసీమ ప్రయోజనాల కోసం, ఆంధ్ర రాయలసీమ నాయకులు కలసి మద్రాసులో కాశీనాధుని నాగేశ్వర్రావుగారి స్వగృహమైన శ్రీబాగ్ లో ఒప్పందం చేసుకున్నప్పుడు, దానిలో సంతకం చేసిన ప్రముఖుల్లో కల్లూరు సుబ్బారావూ ఉన్నారు.
సాహిత్యమూ, కళలంటే వీరికి ఎంతో ఆసక్తి ఉండేది. పెనుగొండలోని గగనమహలులో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక ఉత్సవాన్ని నిర్వహించటంలో (1929) సుబ్బరావు ప్రముఖ పాత్ర వహించారు. అప్పుడేర్పడిన రాయలసీమ కళా పరిషత్తును వీరే చాలాకాలం నిర్వహించి, పండిత కవులకు భూరి సన్మానాలు జరిపేట్లు చేశారు. అనంతపురం పట్టణ కేంద్రంలో తనకున్న విలువైన స్థలాన్ని ఉచితంగా ఇచ్చి లలిత కళా పరిషత్ భవన నిర్మాణాలకు అవకాశం కల్పించారు. రాయలసీమలోని పలుప్రజాసేవా సంస్థలకు వీరు రూపురేఖలు సమకూర్చారు. పట్టు (గుత్తి) కేశవపిళ్లై స్మృతి చిహ్నంగా అనంతపురంలో కేశవ విద్యాలయం అనే హరిజన విద్యార్ధి వసతి గృహాన్ని స్థాపించటంలో వీరు ప్రముఖ పాత్ర వహించారు. బేసిక్ విద్యా కార్యక్రమాన్ని ప్రోత్సహించటానికి హిందూపురంలో సేవామందిర్ అనే సంస్థను, వెంగన్న అనే ఒక మిత్రుని అండదండలతో, 1942లో వీరు నెలకొల్పారు. రాయలసీమలోని భారత సేవక సమాజ శాఖకు వీరు సమావేశకర్తగా వ్యవహరించారు.
1969 లో రాజకీయాల నుంచి వైదొలగి, విశ్రాంత జీవనం గడిపి, 1973 డిశంబరు 20న కాలంచేశారు.





