ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 39 ; కడప కోటిరెడ్డి

393views

భారత స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప అంకితభావంతో పాల్గొని, దేశంకోసం, దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను ధారపోసిన మహనీయులు ఎందరో. దేశ స్వరాజ్యాన్ని, సామాజిక వికాసాన్ని మనసారా కాంక్షించి, దానికై శ్రమించిన మహానుభావుడు కడప కోటిరెడ్డి 1886లో, వారి తండ్రి సిద్ధారెడ్డి, తల్లి నాగమ్మ వీరి తాతయ్య పేరు కోటిరెడ్డి.అందువల్ల వీరికి తాతగారి పేరు పెట్టడం జరిగింది. వీరి పూర్తి పేరు కోటిరెడ్డిగారి కోటిరెడ్డి. పువ్వు పుట్టగా పరిమళిస్తుంది అన్నట్టుగా కోటిరెడ్డికి చిన్ననాటే రామాయణ, భారతాలపై మక్కువ ఏర్పడింది. అక్షరాలు నేర్చిన కోటిరెడ్డికి, రాముడి కథ, పాండవుల త్యాగనిరతి చాలా ఇష్టంగా అనిపించాయి. ఆ కథల్లో కన్పించే మహోన్నతమైన విలువలు, ఆయన జీవితాన్ని ఎంతగానో తీర్చిదిద్దాయి..

ఆయన బాల్యం, తన పల్లెటూరిలోనే సాగింది. ఆ తరువాత ఉన్నత చదువుల కోసం తన ఊరిని వదిలి మద్రాన్ విశ్వవిద్యాలయానికి చేరారు. విశ్వవిద్యాలయంలో కోటిరెడ్డి ఎంతో శ్రద్ధతో చదివి బి.ఏ. పాసయ్యారు. న్యాయశాస్త్ర విద్యకోసం, ఇంగ్లాండ్ వెళ్లి, మిడిల్ టెంపుల్లో చదువుకొన్నారు. బారిస్టరై భారతదేశానికి తిరిగి వచ్చారు. మద్రాసులోనే న్యాయవాదిగా ఆయన ప్రాక్టీసు ఆరంభం అయ్యింది. న్యాయశాస్త్ర చదువులో, జ్ఞానంలో ఆయన గొప్పవాడే కానీ, ఆచరణ దగ్గరకు వచ్చేసరికి, ఆయనకు అంతా అగమ్యగోచరమయ్యింది. ఆ వాతావరణానికి ఆయన మనసు సర్దుబాటు కాలేకపోయింది. కొద్ది రోజులు ఈ సంఘర్షణ అనుభవించాక, కోటిరెడ్డి తన న్యాయవాద ప్రాక్టీసును వదిలిపెట్టి, స్వతంత్ర జీవనాన్ని మనసారా ఇష్టపడ్డ కోటిరెడ్డి, కడప చేరి అక్కడే స్థిరపడ్డారు.

కడపలో ఉన్నప్పుడే కోటిరెడ్డి దృష్టి పూర్తిగా భారత స్వాతంత్ర్య పోరాటం వైపు సాగింది. మహాత్మాగాంధీజీ అన్నా, ఆయన సిద్ధాంతాలన్నా కోటిరెడ్డికి ఎంతో ఇష్టం కలిగింది. ముఖ్యంగా గాంధీ గారి సత్యాహింసల శాంతిమార్గం కోటిరెడ్డిని చాలాఆకర్షించింది. తొలినుండీ ఆయన ఆలోచనలు, ఆశయాలు అందుకు తగ్గట్టుగానే ఉండడంతో స్వరాజ్య పోరాటంతో మమేకమైపోయారు.

1921వ సంవత్సరంలో మహాత్మాగాంధీ ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించారు. సహాయనిరాకరణ ఉద్యమం గురించి ప్రజల్లో గొప్ప అవగాహన కల్పించడానికి మహాత్ముడి ప్రసంగాలు ఎంతో దోహదం చేశాయి. గాంధీజీ రాయలసీమలో పర్యటించినప్పుడు, కోటిరెడ్డి ఆయనతో కలిసి సాగి ప్రతి సభనూ విజయవంతం చెయ్యడంలో ఎంతగానో కృషి చేశారు. మహాత్ముడి మాటను తన మాటగా, మహాత్ముడి బాటను తన బాటగా మలచుకొన్న గొప్ప వ్యక్తి కడప కోటిరెడ్డి.

సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు వీరికి ఆప్తులు. రాయలసీమలో హోంరూల్ ఉద్యమ కార్యక్రమాలలో, సర్వోత్తమరావు గారితో కలిసి పనిచేశారు కోటిరెడ్డి. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీ సంఘంలో కూడా ఎంతో సహకారం అందించారు.

హోంరూల్ ఉద్యమం నాటినుండీ సాగిన కడప కోటిరెడ్డి స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి మహాత్ముడి రాయలసీమ పర్యటనతో ఉత్తేజం పొంది సంపూర్ణంగా స్థిరపడింది.వారి మనసు, ఊహ, ఆశయం, ఆలోచన అన్నీ స్వరాజ్య పోరాటంతోనే సాగుతూ వచ్చాయి. సైమన్ కమీషన్ బహిష్కరణ, దండి ఉప్పు సత్యాగ్రహం కోటిరెడ్డి పోరాట పటిమను మరెంతో ఉత్తేజితం చేశాయి. మహాత్మాగాంధీ వ్యక్తి సత్యాగ్రహం ఆరంభించినప్పుడు వ్యక్తి సత్యాగ్రహిగా ఆయన ముందు నిలిచాడు. దాని ఫలితంగా కోటిరెడ్డిని అరెస్ట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. 1940 డిసెంబర్ 7వ తేదీ నుండి ఎనిమిది నెలలు వెల్లూరు జైలులోనూ, తిరుచినాపల్లి జైలులోనూ కఠినకారాగార దానికి ఆయన శిక్ష అనుభవించారు. జైలు జీవితం ఆయనలోని ధైర్యాన్ని, స్వరాజ్య స్ఫూర్తిని మరింత శక్తిమంతం చేసింది. తిరిగి ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ అరెస్ట్ చేయబడ్డారు. 1942 ఆగస్టు 10వ తేదీ నుండి వెల్లూరు జైలులోనూ, అమరావతి జైలులోనూ, కఠిన కాగారార శిక్షకు గురయ్యారు. ఆ రోజుల్లోనే, వారి తండ్రి మరణించారు. 1943 డిసెంబర్లో ఆయన జైలునుండి విడుదలయ్యారు. రెండవసారి జైలునుండి తిరిగి వచ్చాక, స్వాతంత్ర్యోద్యమంలో మరింత ఉత్సాహంగా పాల్గొన్నారు కోటిరెడ్డి.

స్వాతంత్ర్య పోరాటంతోపాటుగా సాగివస్తున్న ఆంధ్రోద్యమంలో కూడా కోటిరెడ్డి, వారి ధర్మపత్ని రామసుబ్బమ్మ ఎంతో కృషి చేశారు. ఆంధ్ర మహాసభకు 1929లోనూ, 1937 లోనూ, ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. మద్రాసులో 1931లో జరిగిన ఆంధ్రమహాసభ ప్రత్యేక సమావేశం కూడా, కడప కోటిరెడ్డి అధ్యక్షతనే జరిగింది. రాయలసీమ ప్రాంతంలో ఖాదీ ప్రచారానికి, అభివృద్ధికి ఆయన చేసిన కృషి చాలా గొప్పది. తన తొంభై అయిదేళ్ల సంపూర్ణ జీవితమంతా దేశంకోసం, సమాజం కోసం తపించి, సమాజ సేవలో చరితార్దులైన శ్రీ కోటిరెడ్డి 1981లో అమరులయ్యారు.